ఆస్ట్రేలియా ఖండం ఆరని మంటల్లో!

ప్రపంచంలో అతి చిన్న ఖండమైన ఆస్ట్రేలియాను అలుముకున్న కార్చిచ్చు ఎంతకీ ఆరడం లేదు. సెప్టెంబర్​ నుంచి ఇప్పటి వరకు రెండు కోట్ల 60 లక్షల ఎకరాల అడవి కాలిపోయింది. ఇది అమెరికాలోని వెస్ట్​ వర్జీనియా రాష్ట్ర విస్తీర్ణం కన్నా ఎక్కువ. 2018లో కాలిఫోర్నియాలో కాలిబూడిదైన ఏరియాకి 10 రెట్లు. దావాగ్ని ఇంత ప్రమాదకర స్థాయిలో చెలరేగటం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

పోయినేడాది సెప్టెంబరులో అంటుకున్న కార్చిచ్చు ఇంకా ఆరలేదు ఆస్ట్రేలియా. మంచు కురుస్తున్నా మంటలు చల్లారకుండా కొత్త ఏరియాలకు చేరుతున్నాయి. వేడి తట్టుకోలేక పిట్టలు, జంతువులు ప్రాణాలు విడుస్తున్నాయి. జనాలు కుటుంబాలతో వేరే చోట్లకు వెళ్లిపోతున్నారు. పదేళ్ల క్రితం నాటి ‘బ్లాక్​ సాటర్​డే కార్చిచ్చు’తో దీనిని పోలుస్తున్నారు. అప్పట్లో జరిగిన 404 కోట్ల డాలర్ల నష్టాన్ని ఇప్పటి ప్రమాదం దాటేసిందని లెక్కలు వేస్తున్నారు. బ్లాక్​ సాటర్​డే కార్చిచ్చు మెల్​బోర్న్​కి ఉత్తరాన గ్రామాల్లో వ్యాపించింది. మేరీస్​విల్లే టౌన్​ మొత్తం కాలిబూడిదైపోయింది. 173 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మంటల్లో అంతగా ప్రాణనష్టం జరగకపోయినా; ఇతర జంతువులు, అరుదైన చెట్లు, ఆస్ట్రేలియాకే పరిమితమైన జీవరాసులు చాలా చనిపోయాయి.

న్యూసౌత్​ వేల్స్​ దక్షిణ తీరంలోని కొబార్గో, మోగో, మల్లకూట వంటి పట్టణాలకు బాగా డ్యామేజీ జరిగింది. వ్యవసాయానికి, టూరిజానికి కోలుకోలేనంత దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా దక్షిణ తీరమంతా పొగతో నిండిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం జరిగిందని మూడీస్​ అనలిటిక్స్​ అంచనా వేసింది. ఆస్ట్రేలియాలోని అడవుల్లో ఇలాంటి మంటలు చెలరేగడం మామూలే. అయితే, అవి అక్కడికక్కడే ఆగిపోయేవి. లోకల్​ ఎకానమీ వరకు నష్టం జరిగేది. ఇప్పటి కార్చిచ్చు మొత్తం దేశాన్ని నష్టపరిచే లెవెల్లో రేగుతోంది. పండ్లు, కూరగాయలు వంటివి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియాలో ఇది టూరిజం సీజన్​ కూడా. ఆ రంగంపైకూడా బాగా ప్రభావం పడింది. ఈ నష్టాన్ని ఇప్పట్లో పూడ్చుకోవడం కష్టమేనంటున్నాయి టూరిజం సంస్థలు. టూరిస్టు ప్లేస్​లలో పొగతో కళ్లు మండిపోతున్నాయి. లోకల్​ జనాలుకూడా అక్కడ ఉండలేకపోతున్నారని, అలాంటి వాతావరణంలో టూరిస్టులు రావడానికి ఇష్టపడరని చెబుతున్నారు. మొత్తం జనాభాలో 30 శాతంమందిపై వాయు కాలుష్యం ప్రభావం పడింది.

ఆస్ట్రేలియా అడవులు తగులబడుతున్నందున వేడి వాతావరణం, ఎయిర్​ పొల్యూషన్​ బాగా పెరిగాయి. పంట దిగుబడి తగ్గిపోయింది. కార్ఖానాల్లో కార్మికులు పనిచేయలేకపోతున్నారు. వైద్యానికి పెట్టే ఖర్చులు ఎక్కువయ్యాయి. వీటన్నింటి ప్రభావం ఇన్స్యూరెన్స్​ రంగంపైకూడా పడింది. ఎంత మేర నష్టం జరిగిందో కచ్చితంగా చెప్పలేకపోతున్నా ఇన్స్యూరెన్స్​ కంపెనీల్ని దివాలా అంచుకు నెట్టేయడంమాత్రం ఖాయమంటున్నారు ఎకానమిస్టులు. ఈ నెల ఆరో తారీఖు వరకు 8,200 క్లెయిమ్​లు వచ్చాయని, వాటి విలువ సుమారు 65 కోట్ల డాలర్లు (రూపాయల్లో 4,613 కోట్లు) ఉంటుందని ఆస్ట్రేలియా ఇన్స్యూరెన్స్​ కౌన్సిల్​ చెబుతోంది. సొసైటీకి జరిగే పరోక్ష నష్టాన్ని ఇప్పట్లో తేల్చలేమనికూడా మూడీస్​ అనలిటిక్స్​ అంటోంది. నాలుగు నెలలుగా అడవులు తగలబడుతున్నందున ఆస్ట్రేలియన్లు మునుపటిలా ఖర్చు చేయడం లేదు. చాలా జాగ్రత్త పడుతున్నారు. ఈ ఏడాది మిగులు బడ్జెట్​ తేవాలనుకున్న ప్రధాని స్కాట్​ మోరిసన్​ ఆశలు ఆవిరైపోయాయి. ఎన్నో ఏళ్ల నాటి కలప చెట్లు తగలబడిపోవడం, టూరిస్టులు వెళ్లిపోవడం, వేలాది ఎకరాల్లో పంట బూడిదకావడం వంటి నష్టాలతో బడ్జెట్​ తలకిందులైంది.

ఎటు చూసినా బూడిదే!

అడవులు తగలబడడం ప్రతి వేసవిలోనూ ప్రపంచంలో ఏదో ఒక చోట జరిగేదే. కానీ, గ్లోబ్​లో దక్షిణాన ఉన్న ఆస్ట్రేలియాలో ఇది చాలా ఘోరంగా జరుగుతోంది. 2018లో కాలిఫోర్నియా (అమెరికా)లో రేగిన కార్చిచ్చుతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ నష్టం జరిగింది. పర్యావరణ పరంగా చోటు చేసుకున్న నష్టానికి అంచనాలే లేవు. పచ్చటి నేల ఇప్పుడు రూపురేఖలు లేకుండా పోయింది. యూకలిప్టస్​ అడవులు నిలువునా తగలబడిపోయాయి. పర్వతాల్లో ఉండే ప్రత్యేక తరహా వాతావరణం, వర్షాధార అడవులు నామరూపాల్లేవు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన జంతువులు, పక్షులు ఆస్ట్రేలియాలో ఉంటాయి. అవన్నీకూడా మాడిమసైపోయాయి.

ఆస్ట్రేలియా ఖండం మొత్తంగా 125 కోట్ల వరకు జంతువులు, పక్షులు, పాములు చనిపోయి ఉంటాయని నేచర్​ ఫండ్​ అంచనా వేసింది.  వీటిలో 30 శాతం వరకు అరుదైన కోలా జంతువులుంటాయని చెబుతున్నారు. ఒక్క న్యూసౌత్​ వేల్స్​లోనే 80 కోట్ల వరకు జీవరాసులు మంటల వల్లగానీ, వేడికి తట్టుకోలేకగానీ, పొగ చూరిపోవడంతో ఊపిరాడకుండాగానీ చనిపోయినట్లు సిడ్నీ యూనివర్సిటీలో పర్యావరణవేత్త క్రిస్​ డిక్​మన్​ చెప్పారు.

దట్టమైన పొదలతో, చిక్కగా వృక్షాలతో ఉండే అస్ట్రేలియా భూభాగంలో చాలామటుకు ఇప్పుడు బంజరులా మారిందని వరల్డ్​ వైడ్​ ఫండ్​ (డబ్ల్యుడబ్ల్యుఎఫ్​)కి చెందిన స్టువార్ట్​ బ్లాంచ్​ అంటున్నారు. మంటలు పూర్తిగా తగ్గితేగానీ ఎంతమేర నష్టం జరిగిందో చెప్పలేమన్నారు.

కార్చిచ్చు వెనక…

ఈ వైల్డ్​ఫైర్​ ధాటికి ఇప్పటికే 27 మంది చనిపోయారు. రెండు వేల ఇళ్లను, వంద కోట్ల జంతువులను కోల్పోవాల్సి వచ్చింది.  ప్రజలు తమ ఇళ్లు, ఆఫీసులు వదిలేసి సురక్షితమైన చోట్లకు వెళ్లిపోయారు.

కార్చిచ్చు కారణంగా దట్టమైన పొగ వ్యాపించటంతో జనం పీల్చుకోవటానికి మంచి గాలి కూడా కరువైంది. శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బయోడైవర్సిటీ బతికి బట్టకట్టడం కష్టమని సైంటిస్టులు అంటున్నారు. ఎకోసిస్టమ్స్​కి ఇకపైనా తీవ్ర నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. అనుకోకుండా వర్షం కురిసి చల్లారినా… వేడి వాతావరణం, బలమైన గాలుల వల్ల త్వరలో మళ్లీ మంటలు లేస్తాయని చెబుతున్నారు. ఈ విపత్తు నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆరు అంశాలు.

1 ఎండాకాలం : జియోగ్రాఫికల్​గా ఆస్ట్రేలియా దక్షిణార్థ గోళంలో ఉండటం వల్ల ప్రస్తుతం అక్కడ మండు వేసవి కాలం నడుస్తోంది. దీంతో రికార్డ్​ స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఫారెస్ట్​ ఏరియాల్లో తరచూ పిడుగులు పడుతుండటం, చేలల్లో జనం చెత్తకు నిప్పు పెడుతుండటం, గంటకు 80 మీటర్ల వేగంతో గాలులు వీస్తుండటం వంటివి దీనికి తోడయ్యాయి.

2 క్లైమేట్ ఛేంజ్​ : వాతావరణంలో అసాధారణ మార్పులు ఆస్ట్రేలియాని మరింత మండిస్తున్నాయి.  వరుసగా మూడేళ్లు వర్షాలు కురవకపోవటంతో ఎక్కడ చూసినా పొడి వాతావరణమే నెలకొంది. కొద్దోగొప్పో ఉన్న తేమ కూడా మండుతున్న ఎండలతో ఆవిరవుతోంది. పసిఫిక్​, హిందూ మహాసముద్రాలకు మధ్య ఉన్నందున సాధారణంగా ఇక్కడ ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు మించదు. క్లైమేట్​ ఛేంజ్​తో తేమ గాలులు ఈ ఖండం మీదుగా వీయడం లేదు.

3 కార్చిచ్చు కామన్​ : ఆస్ట్రేలియా ఎకోసిస్టమ్​లో కార్చిచ్చులు భాగమై పోయాయి. చాలా మొక్కలు మొలకెత్తటానికి, ఇతర జీవులు సంతానోత్పత్తికి ఈ మంటలపైనే ఆధారపడతాయి. పోషకాల తయారీకి, ఎండిన చెట్లు కాలిబూడిదై నేలలో కలిసిపోవటానికి ఈ మంటలు కావాలి. ఇలా ఎండిపోయిన గడ్డి, పొదలు కొంచెం అగ్గి తగలగానే మంటలు అంటుకుంటున్నాయి.

4 బయోడైవర్సిటీ ‘హాట్’​స్పాట్​: ప్రపంచంలోని గొప్ప బయోడైవర్సిటీగల ప్రాంతాల్లో ఆస్ట్రేలియా ఒకటి. 244 జాతుల క్షీరదాలను (మమ్మల్స్​ని) అక్కడ మాత్రమే చూడగలం. వైరస్​వల్ల, జంతువులు నివసించే ఏరియాల విధ్వంసం, క్లైమేట్​ ఛేంజ్​ వల్ల ఈ బయోడైవర్సిటీ డేంజర్​లో పడింది. కార్చిచ్చుతో కోట్ల కొద్దీ జంతువులు, మొక్కలు నాశనమయ్యాయి. చెత్తా చెదారాన్ని తిని నేలను సారవంతం చేసే కీటకాలూ కనిపించకపోవచ్చు.

5 నిప్పుంటే పొగ తప్పదు : నిప్పు లేనిదే పొగ రాదంటారు. అలాంటిది ఇంత భారీ స్థాయిలో మంటలు చెలరేగితే పొగ ఎంత దట్టంగా వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. పొగ చుట్టుముడితే ఊపిరాడదు.  శ్వాస ఆడినా పొగలోని దుమ్ము, ధూళి కళ్లలోకి, ముక్కుల్లోకి, చివరికి ఊపిరితిత్తుల్లోకి చేరి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. 2.5 మైక్రో మీటర్ల కన్నా చిన్నగా ఉండే రేణువులు ప్రాణాలను తోడేస్తాయి.

6 సర్కారు స్పందన అంతంతే: క్లైమేట్​ ఛేంజ్​ ఎఫెక్ట్​ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టడం లేదు. బొగ్గు ఎగుమతిలో ప్రపంచంలోనే పెద్ద దేశం ఆస్ట్రేలియా. అక్కడి క్లైమేట్​ ఛేంజ్​కు మైనింగ్​ ఇండస్ట్రీ ఒక కారణం. ప్రధాన పార్టీల నేతలకు ఇండస్ట్రియలిస్టుల సపోర్ట్​ ఎక్కువ. బొగ్గు ఉత్పత్తి, గ్రీన్​ హౌస్​​ వాయువులు, కార్చిచ్చులు… ఒకదానికొకటి సంబంధం ఉన్న అంశాలు. దీన్ని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​ అస్సలు ఒప్పుకోరు.