అవినీతి రహిత భారత్​ సాధ్యమే

అవినీతి రహిత భారత్​ సాధ్యమే

పేదలు, మహిళలను అవినీతి  తీవ్రంగా బాధిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా లోక్‌‌‌‌‌‌‌‌పాల్ వ్యవస్థాపక దినం జనవరి 16న ప్రసంగిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. పేదలు తమ ఆదాయంలో అధిక భాగాన్ని లంచాల రూపంలో చెల్లించాల్సి రావడం, ధనికులు చేసినట్టు ఫిర్యాదు చేసే శక్తి లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.  పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన  సమ న్యాయాన్ని పరిరక్షించే సమర్థవంతమైన సుపరిపాలన ప్రజల కల. 

రహస్య పాలనలో ఉండే చీకటిని కోరుకునే అవినీతి సుపరిపాలనకు ప్రధాన అవరోధం. ఇది పౌరుల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది, ప్రభుత్వ విధానాల అమలును సంక్లిష్టం చేస్తుంది. వనరుల దుర్వినియోగానికి దారితీస్తుంది. సామాన్య పౌరులకు అవసరమైన సేవలు పొందడంలో అవినీతి ఒక పెద్ద అడ్డంకి. ముఖ్యంగా, పేదలు, మహిళలు లంచం ఇవ్వలేక కీలకమైన విద్య, ఆరోగ్య సేవలను పొందలేకపోతారు. 

అవినీతి అధికంగా ఉన్న దేశాల్లో బాలల మరణాల రేటు ఇతర దేశాలతో పోలిస్తే 30 శాతం ఎక్కువ. శిశు మరణాల రేట్లు, తక్కువ బరువుతో పుట్టే  పిల్లల సంఖ్య దాదాపు రెండు రెట్లు ఎక్కువ.ట్రాన్స్​పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ రూపొందించిన 180 దేశాల అవినీతి గ్రాహ్యక సూచికలో మనదేశం 93వ స్థానంలో ఉంది. 185 మంది బిలియనీర్లతో (రూ. 8500 కోట్ల విలువైన ఆస్తిపరులు), ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లున్న దేశాల్లో భారత్‌‌‌‌‌‌‌‌ మూడో స్థానంలో నిలిచింది. ఐదవ అతి పెద్ద ఆర్థికశక్తిగా అవతరించిన దేశంలో మరోపక్క, ఆకలితో  కాలే కడుపుతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం బాలలు నీరసిస్తూ నిరీక్షిస్తుంటారు.  అవినీతి- పేదరికాన్ని  సృష్టిస్తోంది. అదొక విష వలయం.


ఏటా కోటి కోట్ల నష్టం


అవినీతి వల్ల వర్ధమాన దేశాలకు ఏటా  రూ.1.06  కోటి కోట్ల నష్టం జరుగుతోందని ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా. ఈ డబ్బుతో 140 కోట్ల మంది పేద ప్రజలను ఆరేళ్ళపాటు పేదరిక రేఖ పైకి తీసుకొని రావచ్చు. ఆకలి లేని సమాజం, పేదరికం లేని ప్రపంచం, నాణ్యమైన విద్య, చక్కని ఆరోగ్యం  వంటి 17 ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల’ సాధన కోసం వర్ధమాన దేశాలకు  ఏటా రూ. 3.38 కోటి కోట్లు అవసరమని ఐక్యరాజ్యసమితి అంచనా.  సుస్థిర అభి వృద్ధి లక్ష్యాల సాధనకు అవినీతే ప్రధాన ఆటంకంగా అవినీతికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం 2021లో గుర్తించారు. బ్రెజిల్ అధ్యక్షతన జి-20 సమావేశాల్లో అవినీతి వల్ల సామాజిక న్యాయం, పర్యావరణ రక్షణలపై  పడుతున్న ప్రభావంపై చర్చ మొదలైంది. 

సమాచార హక్కు వినియోగం ప్రజల చైతన్యంపై ఆధారపడి ఉంది. అవినీతి అనే చీకటిని పారదోలడానికి సమాచార హక్కు చిరుదీపంగా భావిస్తారు. అటల్ బిహారీ వాజ్​పేయి హయాంలో భారత దేశంలో మొదటి సమాచార స్వేచ్ఛా చట్టం 2002లో ఆమోదించబడింది. ఈ చట్టం ప్రేరణతో డా.మన్మోహన్ సింగ్ హయాంలో మరింత బలమైన సమాచార హక్కు చట్టం 2005లో అమలులోకి వచ్చింది. సామాన్యులకు కూడా - పార్లమెంటు సభ్యురాలు లేదా  శాసన సభ్యుని స్థాయిలో  నేరుగా ప్రధానినీ, ముఖ్యమంత్రినే ప్రశ్నించే శక్తినిచ్చే ఈ చట్టం అమలు -సమాచార కమిషనర్ల నియామకంలో పారదర్శకత  లేక దెబ్బతింటోంది. 

సమాచార హక్కు విజయం ప్రజా చైతన్యంపై కూడా ఆధారపడి ఉంటుంది.  బ్రిటన్​లో ప్రజల హక్కులపై ప్రభావం చూపే ఉన్నత స్థాయి కమిషన్ల కోసం దరఖాస్తు చేసిన వారిని పార్లమెంటరీ సంఘం ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు, జవాబులు ప్రజలకు వెల్లడిస్తారు. ఈ స్థాయి పారదర్శకత వలన అసమర్థులు ఎంపికయ్యే  అవకాశమే లేదు. ప్రజా వేగుల రక్షణ చట్టం,  2014 (విజిల్ బ్లోయర్) ఆమోదించబడినప్పటికీ ఇంకా అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ సంస్థలలో జరిగే అవినీతిని వెలికితీసే నిజాయితీపరులైన ఉద్యోగులకు  రక్షణ కల్పించడమేగాక, అవినీతిపరులపై చర్య తీసుకోవడానికి ఈ చట్టం కీలకం.  
నల్ల డబ్బు నల్ల డబ్బుపై పోరాటంలో పన్ను చెల్లింపులలో పారదర్శకత కీలకం. నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ దేశాలలో పొరుగింటి వారి ఆదాయపు పన్ను చెల్లింపు సమాచారం ఆన్​లైన్ ద్వారా తెలుసుకొనే హక్కు ప్రజలకు ఉన్నది. 

ఇందువల్ల  ఆ దేశాలు అవినీతిని బాగా తగ్గించగలిగాయి. ప్రజల పన్నులను ప్రభుత్వ ఎలా ఖర్చు చేస్తుందో  సమాచారం  స్వచ్ఛందంగా వెల్లడించాలి. అమెరికా ఫెడరల్ ఫండింగ్ అకౌంటబిలిటీ, పారదర్శకత చట్టం, 2006 కింద  25000 డాలర్లకు మించిన ఖర్చులన్నీ అంతర్జాలంలో  (http://usaspending.gov) బహిర్గతం చేస్తుంది.  బ్రెజిల్ కూడా అనుసరిస్తోంది. 

యువతదే కీలక పాత్ర

భారత దేశంలో అవినీతి పెద్దగా నష్ట భయం లేని వ్యవహారమై పోయింది.  చైనాలో బ్యాంక్ ఆఫ్ చైనా మాజీ  చైర్మన్, లియు లియాంగేపై అక్రమ రుణాల జారీ ఆరోపణలపై జినాన్ నగర కోర్టు వెంటనే అమలుకాని మరణ శిక్ష విధించి, ఆస్తులన్నీ జప్తు చేసింది.

రెండు సంవత్సరాలలో మరోసారి అవినీతికి 

పాల్పడితే మరణ శిక్ష అమలు అవుతుంది. ఈ స్థాయి శిక్షలు భారత దేశంలో ఊహించలేకపోయినా - లోక్​పాల్, లోకాయుక్త వంటి సంస్థలను పటిష్టం చేసి ఫాస్ట్​ట్రాక్  న్యాయస్థానాలను ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.  అవినీతిని అరికట్టడంలో యువత కీలక పాత్ర పోషించాలి. వారు తమ ఆలోచనలకు కొత్త సాంకేతికతను అన్వయిస్తూ అవినీతికి వ్యతిరేకంగా సమర్థంగా పోరాడాలి.  అపుడు అవినీతి రహిత భారతదేశం సాధ్యమే.

సేవా హక్కు చట్టాలు 

పౌర సేవా హక్కు చట్టాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాలూ ఇప్పటికే అమలు చేస్తున్నాయి.  పౌర సేవా పత్రాలలో నిర్దేశించిన కాల వ్యవధిలో  పౌర సేవలు పొందటం ఇప్పుడు చట్టబద్ధమైన హక్కు.  ఉదాహరణకు వారంలో జనన ధృవీకరణ పత్రం ఇస్తామని మున్సిపాలిటీ ప్రకటిస్తుంది. వారం దాటినా ధృవీకరణ పత్రం జారీ కాకపోతే పౌరులు సేవా హక్కు కమిషన్​లో ఫిర్యాదు చేయవచ్చు. బాధ్యులైన ఉద్యోగులపై జరిమానా విధించే అధికారం 
ఈ చట్టంలో ఉంటుంది.  ఈ  చట్టాల వల్ల పౌర సేవలలో అవినీతి తగ్గుతోంది.

- శ్రీనివాస్ మాధవ్,సమాచార హక్కు పరిశోధకుడు-