- మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం..
- బాధిత దంపతుల ఆత్మహత్యాయత్నం
గజ్వేల్, వెలుగు : మల్టీ లెవల్ మార్కెటింగ్ చిట్ఫండ్ సంస్థలో మోసపోయిన ఓ దంపతులు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గురువారం ఆత్మహత్యకు యత్నించారు. జిల్లాలోని జగదేవ్పూర్ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన జనగామ మాణిక్యం, ఉమ దంపతులు గతంలో మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ సన్ పరివార్అనుబంధ ‘మెతుకు’ చిట్ ఫండ్లో అధిక వడ్డీ ఆశతో భారీ మొత్తంలో డిపాజిట్లు చేశారు. అంతేకాకుండా వీరికి తెలిసిన వారి నుంచి కూడా మల్టీ లెవల్ మార్కెటింగ్ సిస్టం కింద డిపాజిట్లు పెట్టించారు. కొంతకాలం బాగానే నడిచినా 2018లో మోసపూరిత సంస్థగా గుర్తించిన పోలీసులు సంస్థపై కేసు నమోదు చేసి సీఈవోను జైలుకు పంపారు. వీరి డిపాజిట్లతో పాటు ఇతరులతో పెట్టించిన డిపాజిట్లు కూడా అలాగే ఉండిపోయాయి.
డిపాజిట్లు తిరిగి తీసుకోవటానికి చిట్ఫండ్ సంస్థ సీఈవో, ఇతర సిబ్బంది వద్దకు ఎన్ని రోజులు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఇదే టైంలో వీరు డిపాజిట్లు పెట్టించిన వారు తిరిగి ఇప్పించమని ఒత్తిడి చేశారు. దీంతో మాణిక్యం దంపతులు తీవ్ర ఆందోళనతో గజ్వేల్ పట్టణంలో ఉండే సమీప బంధువు వద్దకు వచ్చి విషయంపై చర్చించారు. అనంతరం తీవ్ర మనస్తాపంతో మాణిక్యం దంపతులు పురుగుల మందు తాగారు. విషయం గమనించిన బంధువులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.