ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన దంపతులు

ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం రూరల్​ మండలంలో ఓ జంట ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. మండల పరిధిలోని పొలేపల్లి పంచాయతీలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న భార్యా భర్తలు కందుల అప్పారావు, కల్పన మంగళవారం విడుదల చేసిన గురుకుల బోర్డు ఫలితాల్లో ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వీరి స్వగ్రామం తల్లాడ మండలం, గోపాలరావుపేట కాగా 12 ఏండ్లుగా రూరల్ మండలంలోని రాజీవ్ గృహకల్పలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.

ప్రైవేట్ టీచర్లుగా పని చేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నారు. ఇప్పుడు వీరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. భార్య కల్పనకు బీసీ వెల్ఫేర్, భర్తకు ట్రైబల్ వెల్ఫేర్ లో ఫిజికల్ డైరెక్టర్లుగా ఉద్యోగాలు వచ్చాయి. వీరిద్దరూ జాబ్ ఆర్డర్ ఉత్తర్వులను హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఒకే వేదికపై అందుకున్నారు. ఇద్దరికీ ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు రావడంపై భార్యాభర్తలతో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.