వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరంట్ సప్లయ్ చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు తరచూగా చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. త్రి ఫేజ్ సప్లయ్ టైంపై గందరగోళంగా ఉంది.
ఈ యాసంగి సీజన్‌లో వ్యవసాయానికి 15.15 గంటల పాటు సప్లయ్ చేయనున్నట్లు కామారెడ్డి జిల్లాలో కింది స్థాయిలో ఆఫీసర్లు, సిబ్బంది టైమింగ్స్ ప్రచారం చేశారు. ఉన్నతాధికారులు మాత్రం తాజాగా 24 గంటల పాటు సప్లయ్ ఉంటుందని చెబుతున్నారు. మరో వైపు పీక్ టైంలో లోడ్ ఎక్కువైతే అగ్రికల్చర్‌కు త్రీపేజ్ సప్లయ్ చేయమని కూడా తెలిపారు.
సప్లయ్ టైంపై గందరగోళం
కామారెడ్డి , వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 4 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయి. అందులో 2.50 లక్షల ఎకరాల వరి ఉంటుంది. ఈ పంటలకు భూగర్భజలాలే ఆధారం. జిల్లాలో అగ్రికల్చర్ కరెంట్ కనెక్షన్లు లక్షా 5 వేలు ఉన్నాయి. మరో 5 వేల వరకు ఆనాధికారికంగా ఉంటాయి. బోర్లు కిందనే 3 లక్షల ఎకరాల వరకు పంటలు సాగు అవుతాయి. ఇప్పటికే వరి నాట్లు ఊపందుకున్నాయి. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండడం.. భూగర్భజలాలు కూడా పుష్కలంగా పెరగడంతో బోరుబావుల కింద రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారు.
పవర్ కట్...
నిరుడు యాసంగితో పాటు, వానకాలం సీజన్‌లో వ్యవసాయానికి 10 నుంచి 12 గంటల పాటే త్రీపేజ్ కరెంట్ సప్లయ్ జరిగింది. ఈ యాసంగిలో 15 గంటల 15 నిమిషాల పాటు త్రీపేజ్ కరెంట్ సప్లయ్ చేయనున్నట్లు ఇందుకనుగుణంగా టైమింగ్స్ ప్రకటించారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది కూడా రైతులకు మోటివేట్ చేశారు. త్రీపేజ్ ఉదయం 8.50 నుంచి సాయంత్రం 5.05 గంటల వరకు, రాత్రి 10.20 గంటల నుంచి తెల్లవారుజాము 5.20 గంటల పాటు సప్లయ్ ఉంటుందని తెలిపారు.
సింగిల్ ఫేజ్ సప్లయ్ పొద్దున 5.06 నుంచి 8.49 గంటల వరకు, సాయంత్రం 5.06 నుంచి రాత్రి 10.19 గంటల వరకు సప్లయ్ ఉంటుందని ప్రచారం చేశారు. అయితే ఎన్పీడీసీల్ ఆఫీసర్లు మాత్రం 24 గంటల పాటు సప్లయ్ ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో మాత్రం అగ్రికల్చర్‌కు 10 నుంచి 12 గంటల పాటు కరెంట్ సప్లయ్ ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
24 గంటల పాటు ఇవ్వాలి
నేను ఈసారి ఎకరం వరి పంట సాగు చేస్తున్నా. నీళ్లు పుష్కలంగా ఉన్నందున వరి వేస్తున్నా. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు కరెంట్ సప్లయ్ చేస్తామని చెప్పింది. కానీ చెప్పిన దాంట్లో సగం టైం కూడా సప్లయ్ ఉండడం లేదు. - లింగం, భవానిపేట
24 గంటల పాటు ఇస్తాం..
వ్యవసాయానికి 24 గంటల పాటు కరెంట్ సప్లయ్ చేయాలని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. 15 గంటల పాటు సప్లయ్అనేది ఏమీ లేదు. 24 గంటల పాటు ఉంటుంది. పీక్‌లోడ్ అవర్స్‌లో సప్లయ్‌లో ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం అగ్రికల్చర్‌కు కోత ఉంటుంది. - రమేశ్‌బాబు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ, కామారెడ్డి
10 గంటలకు మించి వస్తలే
ఏడు ఎకరాల్లో వరి పంట సాగు చేస్తాను. ఇందులో కొంత చెరువు కింద, మిగతాది బోరు కింద ఉంటుంది. ఇప్పుడు కరెంట్ 10 గంటలకు మించి వస్తలేదు. ఇలా అయితే పంటలు ఎమవుతాయో అని భయమేస్తోంది. - శివరాజయ్య, ఇసాయిపేట