జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలో బట్టల షాపులో చీరలు కొన్న ఓ కస్టమర్ ఆ షాపు ఓనర్ కు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపినట్టు చూపించి మోసం చేశాడు. ఈ నెల 12న జగిత్యాలలోని ఓ బట్టల షాపుకు నెంబర్ ప్లేట్ లేని బైక్ పై ఓ వ్యక్తి వచ్చాడు. షాపులో రూ.2,200 విలువైన మూడు చీరలు కొన్నాడు. తన దగ్గర డబ్బు లేదని ఫోన్ పే చేస్తానని చెప్పాడు. అంతేకాక తనకు అత్యవసరంగా డబ్బులు అవసరముందని చెప్పగా ఆ షాపు యజమానురాలు తన భర్త నంబర్‌కు ఫోన్ పే చేయమని చెప్పింది.
వెంటనే అతడు రూ. పదివేలు ఫోన్ పే ద్వారా పంపిన ట్టు ఫేక్ ట్రాన్సాక్షన్ మెసేజ్ చూపించాడు. తర్వా త ఆమె దగ్గర రూ. పదివేలు తీసుకొని వెళ్లిపోయాడు. తర్వాత భర్తకు ఫోన్‌చేయగా తన ఫోన్ పే కు ఎటువంటి అమౌంట్ జమ కాలేదని చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడి ఫొటోను మీడియాకు రిలీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.