నిన్న పేజర్లు.. ఇయ్యాల వాకీటాకీలు : లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు

నిన్న పేజర్లు.. ఇయ్యాల వాకీటాకీలు : లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు
  • రేడియోలు, వాకీటాకీలు పేలి 14 మంది మృతి
  • ఇజ్రాయెల్​ నిఘా సంస్థ మొసాద్ పనేనని హెజ్బొల్లా ఆరోపణ
  • పేజర్ పేలుళ్లలో పన్నెండుకు పెరిగిన మరణాలు

బీరుట్: పేజర్ పేలుళ్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరుసటి రోజే లెబనాన్​లో మళ్లీ పేలుళ్లు జరిగాయి. ఈసారి హెజ్బొల్లా సభ్యులు వాడే వాకీటాకీలు, రేడియోలు పేలిపోయాయి. అకస్మాత్తుగా ఆ పరికరాలు పేలడంతో 14 మంది చనిపోగా 450 మందికి పైగా గాయాలయ్యాయి. పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా ఉందని లెబనాన్ అధికారులు తెలిపారు. లెబనాన్​లో హెజ్బొల్లాకు బాగా పట్టున్న ప్రాంతంలోనే ఈ పేలుళ్లు జరిగాయి.  అయితే, ఎన్ని వాకీటాకీలు, రేడియోలు పేలాయనే వివరాలు ఇంకా తెలియ రాలేదని లెబనాన్ అధికారులు తెలిపారు. తూర్పు లెబనాన్ లో పలుచోట్ల టెలిఫోన్లు కూడా పేలిపోతున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. అయితే, ఈ వార్తలను ప్రభుత్వం ధ్రువీకరించలేదు. 

పేజర్లు కొనుగోలు చేసిన సంస్థ నుంచే హెజ్బొల్లా వాకీటాకీలు కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. మరోవైపు, మంగళవారం దేశవ్యాప్తంగా జరిగిన పేజర్ పేలుళ్లలో చనిపోయిన వారి సంఖ్య పన్నెండుకు, గాయపడ్డ వారి సంఖ్య 2,800 లకు పెరిగిందని లెబనాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఫిరాస్ అబియద్ తెలిపారు. ఈ ఘటన నుంచి జనం కోలుకోకముందే బుధవారం వాకీటాకీలు పేలాయి. దీంతో సామాన్యులు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. కాగా, పేజర్ పేలుళ్లతో పాటు వాకీటాకీల పేలుళ్లు ఇజ్రాయెల్​ నిఘా సంస్థ మొసాద్ పనేనని హెజ్బొల్లా సభ్యులు మండిపడుతున్నారు. విదేశీ గడ్డపై ఆపరేషన్లు చేయడం మొసాద్ కు అలవాటేనని, ఈ తరహా దాడులు వేరే వాళ్లు చేసే అవకాశమే లేదని లెబనాన్ ప్రభుత్వం ఆరోపించింది.

పేలుళ్లు వెనుక ఇజ్రాయెల్

లెబనాన్​లో పేజర్ల పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్​కుట్ర ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెజ్బొల్లా మిలిటెంట్​ సంస్థకు చెందిన వారిని పేజర్ల రూపంలో మట్టుబెట్టాలనే ఇజ్రాయెల్​ నిఘా సంస్థ మొసాద్​ప్లాన్ ​చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తైవాన్​నుంచి లెబనాన్ ​దిగుమతి చేసుకున్న 5000 పేజర్లలో మొసాద్ ​సంస్థ పేలుడు పదార్థాలను అమర్చిందని లెబనీస్​ అధికారులు ఆరోపిస్తున్నారు. పక్కా ప్లాన్ ​ప్రకారమే ఈ ఆపరేషన్​జరిగిందన్నారు. లెబనాన్​లో మంగళవారం ఒక్కసారిగా పేజర్లు పేలిపోయిన విషయం తెలిసిందే. 

ఈ ఘటనలో 12 మంది చనిపోగా, 3 వేల మంది వరకు గాయపడ్డారు. ఇందులో అధికంగా హెజ్బొల్లా సభ్యులే ఉన్నారు. ఇరాన్​ రాయబారి కూడా ఈ ఘటనలో గాయపడ్డాడు. కాగా, ఈ ఘటనపై మాట్లాడేందుకు లెబనాన్ సైన్యం నిరాకరించగా.. ఇజ్రాయెల్​పై ప్రతీకారం తీర్చుకుంటామని హెజ్బొల్లా శపథం చేసింది. అయితే, ఈ దాడికి ఇప్పటివరకూ ఏ దేశంకానీ.. ఏ గ్రూపుకానీ బాధ్యత వహించలేదు.

పేజర్లలోనే పేలుడు పదార్థం!

ఇజ్రాయెల్​కు లొకేషన్ ​చిక్కకుండా ఉండేందుకు హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ సభ్యులంతా పేజర్లను వాడుతున్నారు. వీటి ద్వారానే కీలక సమాచారాన్ని చేరవేసుకుంటున్నారు. మంగళవారం పేలిన పేజర్లను తైవాన్​కు చెందిన గోల్డ్ అపోలో సంస్థనుంచి లెబనాన్​కు దిగుమతి చేసుకున్నట్టు న్యూయార్క్​టైమ్స్​పత్రిక నివేదించింది. ఇందులో ‘ఏఆర్924’ మోడల్​కు చెందిన పేజర్లు 3000 వరకు ఉన్నట్టు పేర్కొన్నది. 

అయితే, అవి లెబనాన్​కు రాకముందే అందులో ఇజ్రాయెల్​ఇంటెలిజెన్స్​ పేలుడు పదార్థాలను అమర్చిందని కథనం వెల్లడించింది. పేజర్లను తయారుచేసే ప్రదేశంలో లేదా సప్లై చేసే సమయంలో చొరబడి, ఎక్స్​ప్లోజివ్స్​ను అందులో అమర్చి ఉంటారని బ్రస్సెల్స్​కు చెందిన భద్రతా అధికారి పేర్కొన్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఒక్కో పరికరంలో 3 గ్రాముల చొప్పున పేలుడు పదార్థాన్ని అమర్చినట్టు అనుమానాలున్నాయి. ఈ పేజర్లు లెబనాన్​లోని హెజ్బొల్లా, దాని మిత్ర సంస్థలున్న సిరియా,  ఇరాన్​లోకి చేరాయి.

 ఈ మొత్తం ఆపరేషన్​లో కచ్చితంగా మొసాద్ సభ్యులు నేరుగా పాల్గొని ఉంటారని హెజ్బొల్లా అనుమానిస్తున్నది. కాగా,  ఈ పరికరాలన్నింటికీ మొస్సాద్​కు చెందిన నిపుణులు ఒకేసారి కోడ్​వర్డ్​ను పంపించి, వాటిని పేల్చేశారని లెబనాన్​సెక్యూరిటీ ఆరోపిస్తున్నది. కాగా, ఆ పేజర్లను తాము తయారు చేయలేదని గోల్డ్ అపోలో ఫౌండర్ ​హ్సు చింగ్​ కుయాంగ్​ పేర్కొన్నారు. తమ కంపెనీ బ్రాండ్​ నేమ్​ను ఉపయోగింకునే హక్కు ఉన్న బీఏసీ అనే హంగేరియన్​ సంస్థ  ఈ పేజర్లను తయారు చేసినట్టు వెల్లడించారు. ఈ పేజర్లకు పూర్తి బాధ్యత ఆ కంపెనీదేనని స్పష్టం చేశారు.