జన్నారం, వెలుగు : జన్నారం మండల కేంద్రంలోనే డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్ యూ, ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గతేడాది మండల కేంద్రంలోనే పరీక్షా కేంద్రాన్ని నిర్వహించారని గుర్తుచేస్తూ.. ప్రస్తుతం సుమారు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్సెట్టిపేటకు మార్చడం ఏమిటని ప్రశ్నించారు.
విద్యార్థులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జన్నారంలోనే పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్జామ్ఏర్పడింది. విషయం తెలియగానే ఎస్ఐ సతీశ్ అక్కడకు చేరుకొని వారితో మాట్లాడారు.
విద్యార్థుల సమస్యపై విద్యాశాఖ అధికారులతో మాట్లాడుతానని హమీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు.టీఎస్ యూ జిల్లా ప్రెసిడెంట్ చంద్రశేఖర్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పందిరి మహేశ్, డిగ్రీ స్టూడెంట్లు పాల్గొన్నారు.