తల్లిదండ్రులు పొలం అమ్మి అమెరికాకు పంపిస్తే.. నెల రోజులకే మీ కూతురు చనిపోయిందని ఫోన్ వచ్చింది..

తల్లిదండ్రులు పొలం అమ్మి అమెరికాకు పంపిస్తే.. నెల రోజులకే మీ కూతురు చనిపోయిందని ఫోన్ వచ్చింది..

గుంటూరు: అమెరికాలోని టెక్సాస్లో తెలుగు యువతి దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఏప్రిల్ 12న ఈ ఘటన జరగగా.. ఏప్రిల్ 15న చికిత్స పొందుతూ యువతి చనిపోయింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువతిని గుంటూరు జిల్లాకు చెందిన వంగవోలు దీప్తిగా గుర్తించారు. టెక్సాస్లోని డెంటాన్ సిటీలో ఏప్రిల్ 12న దీప్తి, ఆమె స్నేహితురాలు స్నిగ్ధాతో కలిసి ఇంటికి నడుచుకుంటూ వెళుతున్నారు. ఇంతలో అటుగా అతి వేగంతో వచ్చిన కారు దీప్తిని ఢీకొట్టింది.

ఈ ఘటనలో 23 ఏళ్ల వయసున్న దీప్తి తీవ్రంగా గాయపడింది. దీప్తి తలకు రోడ్డు బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్నిగ్ధా కూడా గాయపడినప్పటికీ ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. స్నిగ్ధా కోలుకోగా, ఏప్రిల్ 15న దీప్తి చికిత్స పొందుతూ చనిపోయింది. దీప్తి స్వస్థలం గుంటూరులోని రాజేంద్రనగర్ అని తెలిసింది. రమాదేవి, హనుమంత రావు ఆమె తల్లిదండ్రులు.

దీప్తి చదువులో ఎంతో ముందుండేదని.. టెన్త్ క్లాస్లో స్కూల్ ఫస్ట్, ఇంటర్మీడియట్, బీటెక్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధించిందని ఆమె కుటుంబం చెప్పింది. నరసరావుపేట NEC కాలేజ్లో ఆమె ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిందని చెప్పారు. అంత బాగా చదువుతుండటంతో కూతురు బంగారు భవిష్యత్ కోసం పొలం అమ్మి మరీ దీప్తిని ఆమె తల్లిదండ్రులు మాస్టర్స్ డిగ్రీ చదువు కోసం అమెరికాకు పంపించారు. 

దీప్తి నెల రోజుల క్రితమే నార్త్ టెక్సాస్లోని డెంటన్ సిటీకి వెళ్లింది. కూతురు జీవితం గురించి ఎన్నో కలలు కన్న ఆ తల్లిదండ్రుల ఆశలను రోడ్డు ప్రమాదం చిదిమేసింది. దీప్తి మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చే విషయంలో దీప్తి తల్లిదండ్రులు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సాయం కోరారు.