- ఇది ప్రతి భారతీయుడి ఆశయం
- వికసిత్ భారత్ సాధనలో రాష్ట్రాలది కీలక పాత్ర
- అంతర్జాతీయ పెట్టుబడుల కోసం పాలసీలు రూపొందించాలి
- మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం
న్యూఢిల్లీ: భారత్‌ను 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం ప్రతి భారతీయుడి ఆశయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలతో నేరుగా సంబంధాలున్న రాష్ట్రాలు ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. అన్ని రాష్ట్రాల సమిష్టి కృషితో వికసిత్ భారత్ కల నెరవేర్చుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కల్చరల్ సెంటర్లో శనివారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్రం నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో 20 రాష్ట్రాల సీఎంలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్ నెంట్ గవర్నర్లు, మంత్రులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. 'ఈజ్ ఆఫ్ లివింగ్ పై దృష్టి సారించి, భ విష్యత్ అభివృద్ధిపైదృష్టి పెట్టండి' అనే నినాదంతో స మావేశం నిర్వహించారు.
2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. ఇందులో ప్రధానంగా తాగునీరు: యాక్సెస్, పరిమాణం, నాణ్యత, విద్యుత్: నాణ్యత, సామర్థ్యం, విశ్వసనీయత, ఆరోగ్యం: యాక్సెసిబిలిటీ, స్థోమత, సంరక్షణ నాణ్యత, పాఠశాల విద్య: అందుబాటులో, నాణ్యత, భూమి, ఆస్తి: యాక్సెసిబిలిటీ, డిజిటలైజేషన్, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అంశాలపై చర్చించారు.
10 రాష్ట్రాల సీఎంలు పాల్గొనలేదు: నీతి ఆయోగ్ సీఈవో
ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్ లో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సీఎంలు పాల్గొన లేదని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం వెల్లడించారు. కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, బిహార్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పుదుచ్చేరి సీఎంలు హాజరు కాలేదని వివరించారు. వీరు హాజరుకాకపోవడం వల్ల వారికే నష్టం అని చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో డెమోగ్రాఫిక్ మేనేజ్ మెంట్, జీరో పావర్టీ అనే అంశాలపై చర్చించినట్టు చెప్పారు.
సరైన దిశలోపయనిస్తున్నాం: మోదీ
అధ్యక్ష హోదాలో మోదీ మాట్లాడుతూ.. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు సరైన దిశలో పయనిస్తున్నామన్నారు. వందేండ్లలో ఒకసారి వచ్చే హమ్మారిని(కరోనా) ఓడించామని చెప్పారు. మన ప్రజలు ఉత్సాహం, విశ్వాసంతో ఉన్నారన్నారు. ఈ దశాబ్దం సాంకేతిక, భౌగోళిక- రాజకీయ మార్పులతో పాటు అవకాశాలతో కూడుకున్నదని చెప్పారు. “ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. అంతర్జాతీయ పెట్టుబడులు సాధించేందుకు అనుకూలమైన పాలసీలు రూపొందించాలి.
భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఇది మెట్టులాంటింది” అని పేర్కొన్నారు. నేషనల్ఎడ్యుకేషన్పాలసీ 2020 లాంటి సంస్కరణలు, ముద్ర, పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధిలాంటి పథకాలు, నేర న్యాయవ్యవస్థలో సంస్కరణలు మొదలైన వాటిని భారత సమాజం, ఆర్థిక వ్యవస్థలో పరివర్తనాత్మక మార్పు తీసుకురావడానికి ఉపయోగించాలని రాష్ట్రాలకు మోదీ సూచించారు.