ములుగు, వెలుగు : అమరుల త్యాగాలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పదేళ్ల పాటు దుర్మార్గపు పాలన కొనసాగిందని, నియంత కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. శనివారం ములుగు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయడం, కేసులు పెట్టడం బీఆర్ఎస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. నిరసనలు చేయకుండా ప్రజలను అడ్డుకున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు విధ్వంసం సృష్టించారని, ఒకవైపు వనరులను కొల్లగొట్టి, మరోవైపు ప్రజాస్వామిక హక్కులను కాలరాశారని విమర్శించారు.
ములుగు జిల్లాలో అటవీ భూములు దున్నుకొని వ్యవసాయం చేసే వారికి హక్కులు కల్పించాలని పోరాటం చేసిన తమ ఉద్యమ ఫలితంతో 2005 అటవీ హక్కుల చట్టం అమలులోకి వచ్చిందని, అయితే పాలకులు అప్రజాస్వామికంగా వ్యవహరించి అడవి బిడ్డలను కొట్టడం, మహిళలను కోర్టులకు ఈడ్చడం చేశారని విమర్శించారు. అణిచివేత ధోరణి అవలంబిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఆయన కోరారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోతు రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.