ఢాకా: బంగ్లాదేశ్లో నిరసనకారుల ఆందోళనలు జుగుప్సాకర స్థితికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్ జాతి పిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ విగ్రహాలను ధ్వంసం చేయడమే కాకుండా ఆయన విగ్రహంపై ఓ నిరసనకారుడు మూత్రం పోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి అయిన షేక్ ముజిబుర్ రెహ్మాన్ భారీ విగ్రహాన్ని ఢాకాలో నిరసనకారులు ధ్వంసం చేశారు. అదే విగ్రహంపైకి ఎక్కి షేక్ ముజిబుర్ రెహ్మాన్ తలపై మూత్రం పోసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Guy urinates on the head of a Sheikh Mujibur Rahman statue in Dhaka. The urine likely splashed down on the crowds below. Is there a better metaphor than this? pic.twitter.com/wnaT4WZsC4
— Shiv Aroor (@ShivAroor) August 6, 2024
అంత పెద్ద విగ్రహం పైకి ఎక్కి ఆ వ్యక్తి మూత్రం పోయడంతో కింద ఉన్న నిరసనకారులపై ఆ మూత్రం పడటంతో అక్కడున్న వారంతా ఇబ్బంది పడ్డారు. ఇలా నిరసన తెలపడంపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్ లిబరేషన్ సాధించడంలో షేక్ ముజిబుర్ రెహ్మాన్ కీలక పాత్ర పోషించారు. లిబరేషన్ పోరాట సమయంలో ఆయన నాయకత్వం వహించిన తీరుకు మెచ్చి బంగ్లాదేశ్ జాతి పితగా బంగ్లా ప్రజలు ఆయనను కీర్తించారు.
అలాంటి షేక్ ముజిబుర్ రెహ్మాన్ 1975, ఆగస్ట్ 15న మిలటరీ చేతిలోనే హత్యకు గురయ్యారు. ఇప్పుడు ఆయన విగ్రహాలను బంగ్లాదేశ్లో నిరసనకారులు ధ్వంసం చేశారు. ఆయన కూతురిని ప్రధాని పీఠం నుంచి దించేసి దేశం విడిచి పారిపోయేలా చేశారు. దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగడం.. శాంతి భద్రతల పరిస్థితి చేయి దాటిపోవడంతో చివరకు సోమవారం నాడు ఆర్మీ రంగంలోకి దిగింది. ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ హసీనాకు అల్టిమేటం జారీ చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేసిన హసీనా దేశం నుంచి పారిపోయి భారత్ చేరుకున్నారు. హిండన్ ఎయిర్ బేస్లో షేక్ హసీనాను జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ కలిశారు. బంగ్లాలో కొనసాగుతున్న సంక్షోభం, తన భవిష్యత్తు ప్రణాళికపై ఆమె దోవల్తో చర్చించినట్టు తెలుస్తోంది. షేక్ హసీనాను భారత్ మిత్రురాలిగా పరిగణిస్తూ వస్తోంది. ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్ పాలన పట్ల కూడా కేంద్రం సానుకూల వైఖరిని కొనసాగిస్తోంది. హసీనా కుమార్తె సైమా వాజేద్ ఢిల్లీలోని డబ్ల్యూహెచ్ఓ సౌత్ ఈస్ట్ ఏసియా డైరెక్టర్గా పని చేస్తున్నారు.
బంగ్లాదేశ్ 1971 మార్చిలో పాకిస్తాన్ నుంచి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ఆ సమయంలో తొమ్మిది నెలలు జరిగిన ఈ అంతర్యుద్ధంలో 30 లక్షల మంది అమరులయ్యారు. 2022 జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ జనాభా 17.12 కోట్లు. తాజాగా షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం 1971 అమరుల వారసులకు ఉద్యోగాల్లో 30 రిజర్వేషన్లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు చేశారు. రోడ్లు, రైల్వే లైన్లను ముట్టడించారు. ఈ రిజర్వేషన్లతో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకే ప్రయోజనం చేకూరుతుందని ఆరోపించారు.
రిజర్వేషన్ల విధానంలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పన్నులు, బిల్లులు ఏవీ కట్టొద్దని ప్రజలను కోరారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థల్ని, ఫ్యాక్టరీలను మూసేయాలని ఉద్యమించారు. ఆందోళనలు అల్లర్లకు దారితీశాయి. హింసాత్మకంగా మారాయి. చిన్నగా మొదలైన ఉద్యమం దేశాన్ని అగ్నిగుండం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసుల కోటాను ఐదు శాతానికి తగ్గించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఒక శాతం గిరిజనులకు, మరొక శాతం ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులకు కేటాయించాలని పేర్కొంది. మిగిలిన 93 శాతం నియామకాలు మెరిట్ ఆధారంగానే చేపట్టాలని చెప్పింది. అయితే స్టూడెంట్లు దీనికి అంగీకరించలేదు. స్వాతంత్య్ర సమరయోధుల వారసుల కోటాను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలను కొనసాగించారు.