భారతీయ సమాజం వైవిధ్యత కలిగినది. వివిధ రంగాల్లో విభిన్నతలు స్పష్టంగా కనిపిస్తాయి. దేశంలోని జాతులు, మతాలు, కులాలు, తెగలు, భాషలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, సంస్కృతి, రాజకీయ, సామాజిక, తాత్విక విచారణల్లోనూ వైవిధ్యత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వైవిధ్యతలను దృష్టిలో పెట్టుకుని భారతీయ సమాజాన్ని జాతిపరమైన, భాషాపరమైన, సాంస్కృతికపరమైన, మతపరమైన విభాగాలుగా విభజించవచ్చు.
దేశంలోని వివిధ జాతులను శాస్త్రీయంగా వర్గీకరించిన మొదటి శాస్త్రవేత్త రిస్లే. ఈయన మానవ శాస్త్రీయ ఉపమాన పద్ధతుల ద్వారా జాతులను వర్గీకరించాడు. రిస్లే భారత జనాభాను ఏడు జాతి సమూహాలుగా వర్గీకరించాడు. అవి.. టర్కో – ఇరానియన్, ఇండో – ఆర్యన్, సైత్రో – ద్రవిడియన్, ఆర్యో – ద్రవిడియన్, మంగోల్ – ద్రవిడియన్, మంగోలాయిడ్. రిస్లే తర్వాత భారతీయ జనాభాను వివిధ జాతి సమూహాలుగా శాస్త్రవేత్త బి.ఎస్.గుహ వర్గీకరించాడు.
1931 జనాభా లెక్కల కోసం చేసిన సర్వేల ఆధారంగా జనాభాను వివిధ జాతులుగా వర్గీకరించాడు. గుహ వర్గీకరణ శాస్త్రీయ పద్ధతులపైన ఆధారపడింది. కాబట్టి నేటికీ ఆయన చేసిన జాతి వర్గీకరణనే ప్రమాణంగా తీసుకుంటున్నారు. ఇది అందరికీ ఆమోదయోగ్యమైన వర్గీకరణ. అందుకే ఈ వర్గీకరణను జనాభాకు సంబంధించిన అన్ని అధ్యయనాల్లోను ఉపయోగిస్తున్నారు. గుహ ప్రకారం నీగ్రిటో, ప్రోటో – ఆస్ట్రలాయిడ్స్, మంగోలాయిడ్స్, మెడిటర్రేనియన్స్, బ్రాఖిసెఫాల్స్, నార్డిక్లుగా జాతులను వర్గీకరించవచ్చు.
భాషాపరమైన విభాగాలు
భాషాపరమైన వైవిధ్యత అనేది భారతీయ సమాజం విశిష్ట లక్షణం. భారత ఉపఖండం గత కొన్ని వేల సంవత్సరాలుగా విభిన్న జాతులకు నిలయంగా ఉంది. విభిన్న జాతులకు చెందిన ప్రజలు వివిధ భాషలు మాట్లాడుతున్నారు. జనాభా శాస్త్రవేత్తల ప్రకారం దేశంలో విభిన్న జాతులకు చెందిన ప్రజలు దాదాపు 1652 భాషలు మాట్లాడుతున్నారు. దీన్నిబట్టి దేశంలో భాషాపరమైన వైవిధ్యత ఎంత ఉందో ఊహించవచ్చు.
1652 భాషల్లో సగం భాషలకు సంబంధించి ఒకొక్క భాషను మాట్లాడే ప్రజలు పది వేలకు మించి ఉండరు. దేశ జనాభాలో 97 శాతం ప్రజలు ప్రధానంగా 23 రకాల భాషలను మాట్లాడుతున్నారు. వీటిలో 18 భాషలను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చారు. భారతీయ ప్రజలు మాట్లాడే భాషలన్నింటిని ఆస్ట్రిక్, ఇండో – ఆర్యన్, ద్రవిడియన్, సైనో – టిబెటిన్, ఇండో యూరోపియన్ భాషా సమూహాలుగా విభజించవచ్చు.
సాంస్కృతికపరమైన విభాగాలు
భారతీయ సమాజం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ ప్రాంతాల వారీగా ఎన్నో రకాలైన సంస్కృతులు కనిపిస్తాయి. ఈ విధమైన సాంస్కృతిక సంక్లిష్టత, సాంస్కృతిక వైవిధ్యత ఏర్పడటానికి ప్రధాన కారణం ఇక్కడ విభిన్న మతాలు, భాషలు ఉండటమే. విభిన్న మతాల, భాషల మూలంగా విభిన్న రకాలైన సంస్కృతులు ఆవిర్భవించడానికి ఆస్కారం ఏర్పడింది.
ఒక రకంగా చెప్పాలంటే భారతీయ సంస్కృతి కాలానుగుణంగా ఉద్భవించిన సంస్కృతి. గత కొన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో రకాలైన సాంస్కృతిక లక్షణాలు, సంస్కృతి విలువలు ఇందులో సమ్మిళితం అయ్యాయి. ఈ రకంగా సమ్మిళితమవుతూ భారతీయ సంస్కృతి నేటి రూపానికి వచ్చింది. అంటే భారతీయ సంస్కృతికి ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది.
భారతీయ సంస్కృతి సంకుచితమైంది కాదు. అది స్వేచ్ఛాయుతమైంది. భారతీయ సంస్కృతి మార్పు చెందుతూ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మార్పు, నిరంతర కొనసాగింపు అనేవి భారతీయ సంస్కృతి సహజ గుణాలని చెప్పవచ్చు. చరిత్ర పూర్వయుగం, ఆ తర్వాత దేశంలో స్థిరపడిన ప్రతి మానవ సమూహం భారతీయ సంస్కృతి అభివృద్ధికి ఎంతో కొంత దోహదపడుతూ వచ్చింది. వైదిక హిందువులు నదులు, పర్వతాలు, వాయువు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, సముద్రం మొదలైన వాటిని పూజించేవారు.
అహింసా సిద్ధాంతం భారతీయ సాంస్కృతిక, తాత్విక వారసత్వంలో భాగంగా మారిపోయింది. వాస్తవికంగా భారతీయ సంస్కృతి ప్రధాన ఉద్దేశం ఆత్మ విముక్తి. వైదిక హిందువులు వివిధ సంస్కృతుల సమ్మేళనంతో ఒక వినూత్న సాంస్కృతిక వ్యవస్థను సృష్టించారు. అయితే ఆ సాంస్కృతిక సమ్మేళనాన్ని వర్ణాశ్రమ ధర్మాలు, పురుషార్థాలు రూపంలో స్థిరపరిచారు. ఈ రెండూ భారతీయ సంస్కృతికి పునాదులుగా నిలిచిపోయాయి.
వీటితోపాటు కర్మ, ధర్మ, పునర్జన్మ అనేవి భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన అంశాలు. హిందువు అనే ఏ వ్యక్తి కూడా వీటిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. అందుకే హిందూ ధర్మం అనేది ఒక మతం కాదు. అది ఒక జీవన విధానమని చెప్పారు. ఈ జీవన విధానం మానవుని సన్మార్గంలో నడిపిస్తుంది. ఈ సంస్కృతి మానవునికి సత్ర్పవర్తన అలవడేటట్లు చేస్తుంది.
మతపరమైన విభాగాలు
భారతీయ సమాజం బహు మతాల సమ్మేళనం. ఇక్కడ విభిన్న మతాలను చూడవచ్చు. భారతదేశంపైకి దండెత్తి వచ్చిన వారితో వ్యాపారస్తులతో శరణార్థులతో మిషనరీలతో ఎన్నో మతాలు ఈ దేశంలోకి వచ్చాయి. అయితే భారతీయ సమాజం ఆయా మతాల పట్ల సమాన వైఖరినే ప్రదర్శించింది కాని వ్యతిరేక వైఖరిని ఎప్పుడూ ప్రదర్శించలేదు. అందువల్లనే భారతీయ సమాజాన్ని లౌఖిక సమాజంగా అభివర్ణించారు.
భారతదేశంలో రాజ్యాంగపరంగా అధికారిక మతమనేది లేనప్పటికీ, భారత ప్రభుత్వం ప్రజలకు ఏ మతాన్నయినా అవలంబించే స్వేచ్ఛను ప్రసాదించింది. ప్రజలకు తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. అంతేగాకుండా ఇతర మతాల స్వేచ్ఛకు భంగం కలగని రీతిలో తమ మత సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవచ్చు. దేశంలో గల ప్రధాన మతాలు హిందూ, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు, బౌద్ధం, జైనం, జొరాస్ట్రియన్ మతాలు.
భారతదేశంలోని మతాలను చారిత్రకంగా పరిశీలిస్తే వాటిని ప్రధానంగా ఐదు వర్గాలుగా వర్గీకరించవచ్చు. భారతీయ సమాజంలో మొదటి నుంచి ఉన్న మత విశ్వాసాలు రెండు. అవి సర్వాత్మ వాదం, ప్రకృతి ఆరాధనా వాదం.
ఇవి భారతీయ సమాజంలో అనాదిగా ఉన్నవి. భారతీయ సమాజంలో మొదట వలస వచ్చి, ఇక్కడ స్థిరపడి, ఒక ప్రబలమైన మతంగా ఆవిర్భవించిన మతం హిందూ. ప్రబలంగా ఉన్న హిందూ మతంపై గల నిరసన ఫలితంగా ఆవిర్భవించిన మతాలు జైనం, బౌద్ధం, సిక్కు మతం.భారతదేశంపైకి దండెత్తి రావడం, వలసవాదం వల్ల ఇతర దేశాల నుంచి భారత దేశంలోకి వచ్చిన మతాలు ఇస్లాం, క్రైస్తవ మతాలు. భారతదేశానికి వలస వచ్చిన మత సమూహాలు యూదులు, జొరాస్ట్రియన్లు, బహాయి మత విశ్వాసాలను అనుసరించేవారు.