- సూర్యాపేటలో డీఎంహెచ్‌వో తనిఖీల్లో బయటపడ్డ బాగోతం
- రెండు నెలల్లో 48 మంది వస్తే 46 మందికి సిజేరియన్
- సుప్రజా హాస్పిటల్ ఆపరేషన్థియేటర్, ల్యాబ్ సీజ్
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేటలో జనరల్ సర్జన్ చదివిన ఓ డాక్టర్ గైనకాలజిస్ట్ గా మారి ప్రసూతి ఆపరేషన్లు చేస్తుండడంతో జిల్లా వైద్యాధికారులు ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ సీజ్‌చేశారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే హాస్పిటల్ సీజ్ చేస్తామని నోటీసులిచ్చారు. మంగళవారం సూర్యాపేటలోని పలు హాస్పిటల్స్ లో డీఎంహెచ్ వో డాక్టర్ కోట చలం ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రజా హాస్పిటల్ లో ఎమ్మెస్ (జనరల్ సర్జన్) చదివిన డాక్టర్ సుప్రజ గైనకాలజిస్ట్ చేయాల్సిన ప్రసూతి ఆపరేషన్లు చేస్తున్నట్టు గుర్తించారు.
మార్చి నెల నుంచి ఇప్పటివరకు 46 సిజేరియన్లు చేసినట్టు తేల్చారు. అంతేకాకుండా అపరేషన్ల సమయంలో అనస్తీషియా డాక్టర్ లేకపోవడంతో జనరల్ సర్జనే మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఆపరేషన్లు చేస్తున్నట్టు తెలుసుకున్నారు. ల్యాబ్‌లో వినియోగించే పాథాలజీ కెమికల్స్ ఫ్రీజర్‌లో కాకుండా బయటనే పెట్టి పరీక్షలు చేస్తుండడం, ఆపరేషన్ థియేటర్ రూల్స్‌కు విరుద్ధంగా ఉండడంతో రెండింటినీ సీజ్ చేశారు.
అర్హత లేని వారిని నర్సింగ్ స్టాఫ్‌గా పెట్టుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో సంజాయిషీ ఇవ్వకపోతే హాస్పిటల్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ కోట చలం మాట్లాడుతూ రూల్స్ ప్రకారం జనరల్ సర్జన్ ప్రసూతి ఆపరేషన్లు చేయకూడదని, అయినా రెండు నెలల్లో 48 మంది గర్భిణులు వస్తే 46 సిజేరియన్లు చేశారన్నారు. గతంలో నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా మేనేజ్మెంట్లో మార్పు రాలేదన్నారు. ఈ తనిఖీల్లో డెమో అంజయ్య, వైద్య ఆరోగ్యశాఖాధికారులు పాల్గొన్నారు.