బెంగళూరు: కర్ణాటకలో వచ్చేది ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారే అని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆయన కుష్టగీ పట్టణంలో మీడియాతో మాట్లాడారు.
యువతకు అధిక ప్రాధాన్యం..
బీజేపీలో యువతకు అధిక ప్రాధాన్యం ఉంటుందని వివేక్ స్పష్టం చేశారు. కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్‌కు పార్టీ లో ప్రాధాన్యం ఇచ్చినా ఆయన కాంగ్రెస్‌లో చేరడం బాధాకరమని అన్నారు. బీజేపీలో అందిరికీ సమ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. కార్యకర్తల అండే పార్టీకి బలమని చెప్పారు.
కాంగ్రెస్‌పై విమర్శలు..
ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై వివేక్ పదునైన విమర్శలు చేశారు. "ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ సర్టిఫికేట్ పూర్తి అబద్ధం. ఇలాంటి మోస పూరిత హామీలతో రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదు. రుణమాఫీ, 4 లక్షల ఉద్యోగాలు తదితర హామీలను ఆ పార్టీ మరిచింది. ఇప్పుడు కర్ణాటకలో అలాంటి హామీలే ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తోంది. కాంగ్రెస్‌కి ఓటేస్తే అది నిరుపయోగంగా మారుతుంది" అని విమర్శలు చేశారు. బీజేపీకి ఓటు వేసి మళ్లీ డబుల్ ఇంజిన్ సర్కార్ ని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.