కలెక్టరేట్ గేట్లకు తాళం వేసి..డబుల్ ఇండ్ల డ్రా

  • భువనగిరిలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల  సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక  
  • ఆందోళనకు దిగిన ప్రతిపక్ష లీడర్లు, పేదలు  
  • అరెస్టు చేసిన పోలీసులు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కోసం నిర్వహించిన డ్రా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ గేట్లకు తాళం వేసి, బీఆర్ఎస్​  కౌన్సిలర్ల సమక్షంలో డ్రా తీయగా.. ప్రతిపక్ష లీడర్లు, పేదలు ఆందోళనకు దిగారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 560 డబుల్ బెడ్​ రూమ్​ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా సింగన్నగూడెంలో 444  ఇండ్లను మూడేండ్ల క్రితమే నిర్మించినా, ఇంకా అవసరమైన వసతులు కల్పించలేదు. ఈ ఇండ్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా.. 4,315 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంక్వైరీ చేసి 1,700 మందిని అర్హులుగా తేల్చారు. వార్డుల వారీగా లిస్టులు ప్రకటించి, అభ్యంతరాలు స్వీకరించారు.

అయితే ఈ లిస్టులో తమ పార్టీ వాళ్ల పేర్లు లేకపోవడంతో ఆఫీసర్లపై బీఆర్ఎస్ ​లీడర్లు ఒత్తిడి తెచ్చారు. దీంతో లబ్ధిదారుల ఎంపిక ఆలస్యం జరగడమే కాకుండా 1,950 మంది పేర్లతో రెండోసారి అర్హుల లిస్టును ప్రకటించారు. ఈ లిస్టును వార్డుల్లో అంటించనేలేదు. లబ్ధిదారుల ఎంపిక కోసం బుధవారం కలెక్టరేట్​లో డ్రా తీస్తామని ఆఫీసర్లు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​ కౌన్సిలర్లతో పాటు ఆయా పార్టీల లీడర్లు కలెక్టరేట్​కు చేరుకున్నారు. భువనగిరి ఆర్డీవో ఎంవీ భూపాల్​రెడ్డి, మున్సిపల్​చైర్మన్​ఎనబోయిన ఆంజనేయులు, కమిషనర్​నాగిరెడ్డి డ్రా ప్రక్రియను ప్రారంభించారు. అయితే వార్డుల వారీగా సభలు ఏర్పాటు చేసి, లబ్ధిదారులను ఎంపిక చేయాలని బీజేపీ, కాంగ్రెస్​కౌన్సిలర్లు, లీడర్లు డిమాండ్ చేశారు. ఆఫీసర్లు, బీఆర్ఎస్​కౌన్సిలర్లు పట్టించుకోకపోవడంతో  అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వాళ్లందరినీ బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. అనంతరం కలెక్టరేట్​గేట్లకు తాళం వేసి, బీఆర్ఎస్ కౌన్సిలర్ల సమక్షంలో డ్రా కొనసాగించారు.  

9 గంటల పాటు ఆందోళన..   

బీఆర్ఎస్​ కౌన్సిలర్ల సమక్షంలో డ్రా జరుగు తోందని తెలియడంతో ఆశావహులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్​కు తరలివచ్చారు. ఇం డ్లున్న వారికి, నాన్​ లోకల్స్​కు ఇండ్లు కేటాయిస్తున్నారని తెలిసి ఆందోళనకు దిగారు. పోలీసులు స్టాఫ్​తో సహా ఎవరినీ లోపలికి అనుమతించకపోవడంతో కొందరు కలెక్ట రేట్​గేటు దూకడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరి గింది. మహిళా పోలీసులు మహిళలను బలవంతంగా లాక్కెళ్లారు. లీడర్లు, ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. రాత్రి 7 గంటలకు డ్రా పూర్తి కావడంతో ఆఫీసర్లు వెళ్లిపోయారు.

ఉదయం 11 గంటల నుంచి దాదాపు 9 గంటలపాటు ఆందోళన కొనసాగింది. కాగా, 444 ఇండ్లకు గాను  424 మంది లబ్ధిదారులను డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. మిగిలిన 20 ఇండ్లను రోడ్డు ప్రమాదాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ చిన్నారులకు, దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులకు కేటాయించేందుకు రిజర్వ్ చేశారు.