ఫుల్లుగా తాగి 108కు ఫోన్​

ఫుల్లుగా తాగి 108కు ఫోన్​
  •  జనగామలో దింపాలంటూ న్యూసెన్స్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫుల్లుగా మద్యం తాగిన ఓ వ్యక్తి ఎమర్జెన్సీ అంటూ 108కు ఫోన్​చేసి అంబులెన్స్ ను రప్పించాడు. తర్వాత తనను అమ్మమ్మ ఊరైన జనగామలో దింపాలని అంబులెన్స్​సిబ్బందితో గొడవకు దిగాడు. వివరాల్లోకి వెళ్తే.. రమేశ్ అనే వ్యక్తి బుధవారం అర్ధరాత్రి తర్వాత 108కు కాల్​చేశాడు. తాను స్పృహ కోల్పోతున్నానని, వరంగల్- హైదరాబాద్ హైవేపై, జమ్మాపురం శివారులో ఉన్నానని, త్వరగా రావాలని చెప్పాడు. 108 డ్రైవర్ మహేశ్, సిబ్బందితో హుటాహుటిన అక్కడికి వెళ్లారు.

బాధితుడి కోసం వెతుకుతుండగా, ఫుల్లుగా మద్యం తాగిన రమేశ్ వెహికల్​వద్దకు వచ్చాడు. ఫోన్​చేసింది తానేనని, అమ్మమ్మ ఊరైన జనగామకు తీసుకెళ్లాలన్నాడు. దీంతో 108 సిబ్బంది అవాక్కయ్యారు. వారు ఎంత సముదాయించినా రమేశ్​వినిపించుకోలేదు. జనగామలో డ్రాప్ చేయాలంటూ గొడవకు దిగాడు. ‘నేను హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ వస్తున్నా.. జనగామ వెళ్లాలి.. బస్ ఫెసిలిటీ లేదు. నేను అన్ కాన్షియస్ అవుతున్నా..’ అని వాదించాడు.

కావాలంటే భువనగిరి ఏరియా హాస్పిటల్ లో దింపుతామని 108 సిబ్బంది చెప్పినా వినిపించుకోలేదు.  గురువారం రమేశ్​గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 108 సిబ్బందితో తాగుబోతు వీరంగం అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైరికల్​గా ట్రోల్స్ చేస్తున్నారు. మందు ఎక్కువైతే ఇంట్లో పడుకోవాలిగానీ,108కు ఫోన్ చేయడమేంటిరా బాబు? అంటూ కామెంట్లు చేస్తున్నారు.