కేపీహెచ్‎బీలో నకిలీ క్లినిక్.. బాగోతం బట్టబయలు చేసిన అధికారులు

కేపీహెచ్‎బీలో నకిలీ క్లినిక్.. బాగోతం బట్టబయలు చేసిన అధికారులు

హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంతో కొందరు నకిలీ డాక్టర్లు చలగాటమాడుతున్నారు. డబ్బు కోసం ఫేక్ సర్టిఫికేట్‎లతో ఆసుపత్రులు, క్లినిక్‎లు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. నకిలీ డాక్టర్లు, ఆసుపత్రులు, క్లినిక్‎లపై ప్రభుత్వం ఉక్కపాదం మోపుతున్నా.. వీరి కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‎లో మరో నకిలీ క్లినిక్ బాగోతం బట్టబయలైంది. కేపీహెచ్‎బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్య ఎలైట్ మూడవ ఫ్లోర్‎లో అనుమతులకు విరుద్ధంగా డాక్టర్ సుగుణస్ ప్రీమియర్ డెర్మటాలజీ పేరిట క్లినిక్‎ను నిర్వహిస్తున్నారు. 

విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య అధికారి డాక్టర్ రఘునాథ్ స్వామి గురువారం ఈ క్లినిక్‎లో తనిఖీలు నిర్వహించారు. క్లినిక్‎కు సంబంధించిన రిజస్ట్రేషన్ పత్రాలను పరిశీలించగా.. అవి ఫేక్ డాక్యుమెంట్స్ అని తేలింది. దీంతో క్లినిక్‎ను డాక్టర్ రఘునాథ్ స్వామి సీజ్ చేశారు. గత 11 నెలలుగా ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ట్రీట్మెంట్ నిర్వహిస్తున్నారని వెల్లడించారు. క్లినిక్ నిర్వహకుల నుండి తమకు ఎలాంటి అప్లికేషన్ రాలేదని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.