ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి.. రూ.10 లక్షల క్లెయిమ్ కొట్టేశారు..!

ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి.. రూ.10 లక్షల క్లెయిమ్ కొట్టేశారు..!
  • కుటుంబ సభ్యులతో కలిసి 
  • ఎల్ఐసీ ఏజెంట్ మోసం
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో వెలుగులోకి..

భద్రాచలం, వెలుగు: బతికుండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకుని ఎల్ఐసీ క్లెయిమ్ డబ్బులు కొట్టేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బూర్గంపాడు మండలం సారపాకలోని భాస్కర్​నగర్‎కు చెందిన భూక్యా శ్రీరాములు 2017 నుంచి ఎల్ఐసీ ప్రీమియం కడుతుండగా.. ఇటీవల అతని ఒరిజినల్ ఎల్ఐసీ బాండ్ పేపర్లు పోయాయి. కాగా.. సంజీవరెడ్డిపాలెంకు చెందిన ఎల్ఐసీ ఏజెంట్​వద్దకు భూక్యా శ్రీరాములు వెళ్లి తెలిపాడు. 

దీంతో క్లెయిమ్ డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. ఏపీలోని కుక్కునూరు మండలం నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకొచ్చారు. ఒరిజినల్ బాండ్ ​లేకపోవడంతో ఫేక్ బాండ్​తయారు చేయించారు. అయితే.. మరో సీనియర్​ఎల్ఐసీ ఏజెంట్ ష్యూరిటీ బాండ్ ఇస్తేనే క్లెయిమ్ ఇస్తారు. ఆయన ఇచ్చిన బాండ్‎తో డెత్ సర్టిఫికెట్‎ను కలిపి శ్రీరాములు పేరిట డెత్​ క్లెయిమ్ చేసుకుని రూ.10 లక్షలు తీసుకుని.. కుటుంబ సభ్యులు ఏజెంట్లు పంచుకున్నారు. 

ఇది కాస్త బయటకు తెలియడంతో పాటు సోషల్​ మీడియాలోనూ వైరల్​అయింది. దీంతో భద్రాచలం ఎల్ఐసీ అధికారులు విచారించి రిపోర్ట్‎ను హెడ్డాఫీసుకు పంపించారు. కాగా సంజీవరెడ్డిపాలెంకు చెందిన ఎల్ఐసీ ఏజెంట్​పరారీలో ఉన్నాడు. దీనిపై భద్రాచలం ఎల్ఐసీ బ్రాంచ్​మేనేజర్‎ను వివరణ కోరగా.. నివేదికను హెడ్డాఫీసుకు పంపించామని, పూర్తిస్థాయిలో విచారణ చేశాక వాస్తవాలు తెలుస్తాయని తెలిపారు.