- భార్య మృతి..తండ్రీకూతుళ్లకు గాయాలు
మేడిపల్లి, వెలుగు : ఆర్థిక ఇబ్బందులతో చేతి మణికట్టుకు కరెంట్ వైర్లను చుట్టుకొని ఓ కుటుంబం సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, తండ్రీ కూతుళ్లకు గాయాలయ్యాయి. ఘట్ కేసర్ మండలం ప్రతాపసింగారం గ్రామానికి చెందిన పగిడిమర్రి రామకృష్ణాచారి, విజయలక్ష్మి (33) దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. నగరంలో కార్పెంటర్‌గా పని చేస్తున్న రామకృష్ణాచారికి వృత్తిపరంగా రావాల్సిన డబ్బులు రాకపోవడంతో కొన్ని నెలలుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శనివారం కొడుకు కాలేజీకి వెళ్లిన తర్వాత భార్య విజయలక్ష్మి, కూతురు శ్రీవైష్ణవితోపాటు తన చేతి మణికట్టుకు కరెంట్ వైర్లను చుట్టిన రామకృష్ణాచారి.. ప్లగ్‌లో పెట్టి స్విచ్చాన్ చేశాడు. వెంటనే కూతురు శ్రీవైష్ణవి తన చేతిని లాగి గట్టిగా అరవడంతో.. స్థానికులు వచ్చి తండ్రీ కూతుళ్లను కాపాడారు.
అప్పటికే విజయలక్ష్మి మృతి చెందడంతో మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలంలో సూసైడ్‌నోట్‌ను గుర్తించారు. మరోవైపు తల్లి మరణ వార్త తెలుసుకొని కాలేజీ నుంచి బైక్‌పై హుటాహుటిన బయలుదేరిన కొడుకు రోడ్డుపై కిందపడి గాయపడ్డాడు. ఈ ఘటన ప్రతాపసింగారంలో విషాదం నింపింది.