అప్పులకు వడ్డీలు కడుతూ అలసిపోయాం.. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం అదృశ్యం

అప్పులకు వడ్డీలు కడుతూ అలసిపోయాం.. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం అదృశ్యం

హైదరాబాద్ మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలీమ్ నగర్ లో ఓ కుటుంబం అదృశ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కనిపించకుండాపోయిన వారి కోసం పోలీసులు అన్ని చోట్ల గాలిస్తున్నారు. 

అసలేం జరిగింది..?  

సలీమ్ నగర్ లో వరాహమూర్తి, దుర్గ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నాడు. కుమారుడి పేరు సత్య భైరవ. వీరు వృత్తి రీత్యా గోల్డ్ స్మిత్ పనులు చేస్తుంటారు. ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు. మహమ్మద్ ఖాన్ జ్యువెలరీ షాప్ లో వరాహమూర్తి ఆయన కుమారుడు సత్య భైరవ ఉద్యోగాలు చేస్తున్నారు. 

సుమారు రూ.50 లక్షల వరకు అప్పులు చేశారు. ఈ క్రమంలో తండ్రీ కొడుకులు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ జీవనం సాగిస్తున్నారు. వడ్డీలు కట్టీ కట్టీ అప్పుల ఊబిలో మరింత కూరుకుపోయారు. ప్రత్యామ్నాయ మార్గం లేక జీవితంపై విరక్తి పుట్టి.. అందరూ చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇంటి నుంచి ఎక్కడకో వెళ్లిపోయారు. 

డిసెంబర్ 20వ తేదీన ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. "మాకు చావు తప్ప వేరే మార్గం లేదు.. క్షమించండి. మా చావులకు ఎవరూ బాధ్యులు కాదు" అంటూ ఇంట్లో ఓ పేపర్ పై రాసి పెట్టి వెళ్లారు. అంతేకాదు.. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తమ వెంట సెల్ ఫోన్లను తీసుకెళ్లలేదు. వాటిని ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయారు.

విషయం తెలుసుకున్న కూతురు చాముండేశ్వరి మలక్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.