- మహిళ మృతి, భర్త, కూతురి పరిస్థితి విషమం
నేలకొండపల్లి, వెలుగు: నూనె అనుకుని పురుగుల మందుతో వండిన కూర తిన్న ఓ మహిళ మృతిచెందగా భర్త, కూతురు ఆస్పత్రి పాలయ్యారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మేడిదపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన బండ్ల నాగమ్మ (37) గురువారం ఉదయం ఎప్పటిలాగే వంట చేసింది. అయితే వంట గదిలో పురుగుల మందు డబ్బా ఉండగా నూనె అనుకుని దానిని వాడింది.
అన్నం, కూర అయిన తర్వాత ముందు తాను తిని..తర్వాత పొలంలో పనిచేస్తున్న భర్త పుల్లయ్య, కూతురు పల్లవికి క్యారేజీ తీసుకెళ్లింది. అన్నం తినడానికి కూర్చున్న భర్త, కూతురు వాసన రావడంతో రెండు ముద్దలు తిని ఆపేశారు. అప్పటికే నాగమ్మకు వాంతులు కావడంతో కూరలో ఏదో కలిసిందన్న అనుమానంతో చుట్టుపక్కల వాళ్లు ముగ్గుర్ని ఆస్పత్రికి తరలించారు. నాగమ్మ అదేరోజు రాత్రి మృతిచెందింది. భర్త, కూతురు చికిత్స పొందుతున్నారు. భర్త పరిస్థితి విషమంగా ఉంది. నాగమ్మకు మతిస్థిమితం సరిగా లేదని స్థానికులు తెలిపారు.