ఏ కష్టం వచ్చిందో పాపం.. పిల్లలతో సహా గోదావరిలో దూకాలనుకున్నారు.. పోలీసులు రాకపోతే..

ఏ కష్టం వచ్చిందో పాపం.. పిల్లలతో సహా గోదావరిలో దూకాలనుకున్నారు.. పోలీసులు రాకపోతే..

రెక్కాడినా డొక్కాడని రోజులు ఇవి. ఎంత జీతం సంపాదించినా.. ఎంత పనిచేసినా.. చాలీ చాలని జీతాలతో బతుకు బండిని ఈడుస్తున్నారు మధ్యతరగతి ప్రజలు. పెరుగుతున్న అప్పులకు తోడు ఆర్థిక మాంద్యంతో ధరలు పెరుగుడే తప్ప తగ్గడం లేదు. దానికితోడు కుటుంబ సమస్యలు, కలహాలు కొందరిని కుంగదీస్తున్నాయి. ఈ స్థితిలో బతకలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక జంట లోకజ్ఞానం కూడా రాని చిన్న చిన్న పిల్లలతో సహా గోదావరిలో దూకే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు కాపాడి కౌన్సెలింగ్ ఇచ్చారు.

వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ పట్టణానికి చెందిన కోమటి గంగా ప్రసాద్ తన ఇద్దరు కుమార్తెలు వైశాలి(6), రణవిత(4)లతో బాసర గోదావరి నదిలో దూకే ప్రయత్నం చేశారు. నిర్మల్ జిల్లా బాసర గోదావరి బ్రిడ్జి వద్ద ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతుండగా బాసర పోలీసులు అడ్డుకున్నారు‌‌. 

ALSO READ | కొండంపేటలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి..ఏడుగురికి గాయాలు

 గోదావరి బ్రిడ్జి వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ మోహన్ సింగ్,  దీపాలి వారిని కాపాడారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఇన్స్పెక్టర్ కు జరిగిందంతా చెప్పారు.  కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు పోలీసుల ముందు వాపోయారు. పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.