హైదరాబాద్, వెలుగు: వినియోగదారులను వాటర్ బోర్డు షాక్‌కు గురిచేస్తోంది. ఎప్పుడు వందల్లో వచ్చే వాటర్ బిల్లులు ఒక్కో సారి వేలల్లో వస్తుండటంతో జనం పరేషాన్ అవుతున్నారు. ప్రతి నెల ఎక్కడో ఒక చోట ఈ సమస్య వస్తూనే ఉంది. ఇటీవల బీరంగూడ సెక్షన్ 24వ డివిజన్ పరిధి ఆర్సీపురానికి చెందిన మల్లిక ప్రభల అనే మహిళ ఉండే ఇంటికి సెప్టెంబర్ నెలకు సంబంధించిన
బిల్లు(నం.131602975) రూ.50,771గా ఈ నెల 17న వాటర్ బోర్డు అధికారులు అందించారు. అయితే ఈ బిల్లును చూసిన ఆమె షాక్‌కు గురైంది. ప్రతినెల 30 లోపు వచ్చే బిల్లు ఇంత మొత్తం రావడంపై ఆందోళన చెందింది.
మంగళవారం స్థానిక వాటర్ బోర్డు ఆఫీసుకి వెళ్లి అడిగితే అక్కడ సరైన సమాధానం ఇవ్వలేదు. పైగా ఆ బిల్లు మొత్తం చెల్లిస్తేనే ఎందుకు ఇలా జరిగిందన్నది చెబుతామనడంతో మల్లిక ఖైరతాబాద్‌లోని వాటర్ బోర్డు హెడ్డాఫీసుకి వెళ్లి డైరెక్టర్ట్ శ్రీధర్‌ను ఆశ్రయించింది. నల్లా మీటర్ పనిచేయకఇలా వచ్చి ఉంటుందని, మీటర్‌ను టెస్టింగ్ కోసం పంపించి బిల్లు సరిచేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు మల్లిక చెప్పింది. డివిజన్ స్థాయిలోనే సమస్యను పరిష్కరించి ఉంటే ఆర్సీపురం నుంచి ఖైరతాబాద్‌కు వచ్చే అవసరం ఉండేవి కాదని ఆమె తెలిపింది. చాలామందికి ఇలాగే ఎక్కువ బిల్లులు వస్తున్నట్లు
తెలుస్తోంది.