దేశం అవాక్కయ్యింది: భర్త డాక్టర్.. భార్య లాయర్.. ఇద్దరు ఇంటర్ పిల్లలతో సహా ఆత్మహత్య

దేశం అవాక్కయ్యింది: భర్త డాక్టర్.. భార్య లాయర్.. ఇద్దరు ఇంటర్ పిల్లలతో సహా ఆత్మహత్య

కొన్ని ఘటనను జీర్ణించుకోలేకుండా ఉంటున్నాయి. కుటుంబాలతో సహా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మొన్న తెలంగాణలో జరిగిన ఆత్మహత్యల తరహాలోనే.. ఇప్పుడు చెన్నై సిటీలో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవటం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీనికి కారణం లేకపోలేదు. అతను పేరుమోసిన డాక్టర్.. సిటీలో చాలా ల్యాబ్స్ ఉన్నాయి. అతని భార్య అడ్వకేట్.. ఇక ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లోడు నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు.. మరో కొడుకు టెన్త్ చదువుతున్నాడు.. ఈ కుటుంబం మొత్తం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవటంతో చెన్నై సిటీలో ఈ ఘటన సంచలనంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. డాక్టర్ బాలమురుగన్ చెన్నైలోని అన్నా నగర్ లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన భార్య సుమతి అడ్వకేట్. ఈ దంపతులకు నీట్కు ప్రిపేర్ అవుతున్న జశ్వంత్ కుమార్, ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న లింగేష్ కుమార్ అనే కొడుకులు ఉన్నారు. కారణమేంటో స్పష్టంగా తెలియదు గానీ ఇవాళ ఉదయం (మార్చి 13, 2025) ఈ నలుగురూ సొంత ఇంట్లో శవాలై కనిపించారు.

రెండు రూముల్లో ఉరేసుకుని ఈ నలుగురూ విగత జీవులుగా పడి ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. ఆర్థిక సమస్యల కారణంగానే ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ బాలమురుగన్ చెన్నై సిటీలో కొన్ని ఆల్ట్రాసౌండ్ సెంటర్స్ను నడిపిస్తున్నట్లు తెలిసింది. 

వ్యాపారంలో నష్టాలు రావడంతో బాలమురుగన్ పెద్ద మొత్తంలో అప్పుల్లో కూరుకుపోయాడు. ఇవాళ ఉదయం డ్రైవర్ బాలమురుగన్ ఇంటికి చేరుకున్నాడు. ఇంటి డోర్ కొట్టినా ఎవరూ స్పందించకపోవడంతో డ్రైవర్కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు ఇంటికి చేరుకుని డోర్ బద్ధలు కొట్టి చూడగా.. రెండు రూముల్లో బాలమురుగన్(52), సుమతి(47), వీళ్ల ఇద్దరి కొడుకులు ఉరేసుకున్న స్థితిలో కనిపించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్పాట్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.