కొంపముంచిన గూగుల్ మ్యాప్.. గోవా పోదామనుకుంటే దట్టమైన అడవిలోకి

కొంపముంచిన గూగుల్ మ్యాప్.. గోవా పోదామనుకుంటే దట్టమైన అడవిలోకి

బెళగావి: గూగుల్ మ్యాప్‎‎ను నమ్ముకుంటే కొంపముంచింది. దారి చూపిస్తదని అనుకుంటే దట్టమైన అడవిలోకి తీసుకెళ్లింది. బిహార్‎కు చెందిన ఓ ఫ్యామిలీ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ అడవిలో గడిపేలా చేసింది. ఈ సంఘటన ఈ నెల 4న జరిగింది. బిహార్ కు చెందిన రంజిత్ దాస్ తన ఫ్యామిలీతో కలిసి గోవా ట్రిప్ కు కారులో బయలుదేరారు. అయితే వాళ్లకు రూట్ తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్ ను నమ్ముకున్నారు. అది చూపిన దారిలోనే వెళ్లారు. తీరా కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లాక చూస్తే అదొక దట్టమైన అడవి అని అర్థమైంది. 

గూగుల్ మ్యాప్ వాళ్లను కర్నాటక బెళగావి జిల్లాలోని భీమ్ గాడ్ అడవుల్లోకి దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల లోపలికి తీసుకెళ్లింది. ఎవరికైనా ఫోన్ చేద్దామంటే, అక్కడ సిగ్నల్స్ కూడా లేవు. దీంతో చేసేదేంలేక ఆ రాత్రంతా కారులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. తెల్లారిన తర్వాత రంజిత్ దాస్ దాదాపు 4 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లగా మొబైల్ సిగ్నల్ దొరికింది. వెంటనే ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ 112కు కాల్ చేసి తమ పరిస్థితి చెప్పడంతో లోకల్ పోలీసులు వచ్చి కాపాడారు. 

‘‘రంజిత్ దాస్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ 112కు కాల్ చేయగా, బెళగావి కంట్రోల్ రూమ్ మాకు సమాచారం అందించింది. మేం జీపీఎస్ కోఆర్డినేట్స్ ఆధారంగా, స్థానిక గ్రామస్తుల సహాయంతో వాళ్లున్న ఏరియాకు వెళ్లాం. అదృష్టవశాత్తూ వాళ్లకు మొబైల్ సిగ్నల్ దొరకడంతో మేం రాగలిగాం. ఇదొక దట్టమైన అడవి. ఇక్కడ క్రూరమృగాలు ఉన్నాయి. ఇటీవల ఓ రైతుపై గుడ్డెలుగు దాడి చేసింది” అని ఖానాపూర్ సీఐ మంజునాథ్ నాయక్ తెలిపారు.