సియోని: అమీర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో హీరోయిన్ అక్కకు పురిటి నొప్పులు వస్తే ఆమెకు డెలివరీ చేయడం పెద్ద టాస్క్ అవుతుంది. ఆమెకు సడన్గా పురిటి నొప్పులు వస్తాయి. భారీగా వర్షం పడుతుంటుంది. డాక్టర్లు వచ్చే పరిస్థితి ఉండదు. హీరోయిన్ వెబ్ క్యామ్ ద్వారా డెలివరీ ఎలా చేయాలో హీరోకు చెబుతూ ఉంటుంది. హీరో ఎంతో కష్టపడి విజయవంతంగా ఆమెకు పురుడు పోస్తాడు. దాదాపుగా సేమ్ సీన్ మధ్యప్రదేశ్ లోని సియోనిలో రిపీటైంది. మధ్యప్రదేశ్లోని సియోనిలో జులై 23న భారీ వర్షాలు కురిశాయి. చాలా గ్రామాలను వరదలు ముంచెత్తాయి.
సియోని తాలూకాలోని జోరాబాది అనే గ్రామం కూడా జలదిగ్భంధంలో చిక్కుకుపోయింది. ఈ గ్రామానికి చెందిన రవీనా బన్సీలాల్ అనే గర్భిణికి జులై 23న పురిటి నొప్పులొచ్చాయి. సియోనికి వచ్చే రోడ్లన్నీ వరదల్లో చిక్కుకున్నాయి. ఊరి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఊరిలో ఉన్న ఆశా వర్కర్ దగ్గరకు రవీనా కుటుంబం వెళ్లింది. అయితే.. ఆ ఆశా వర్కర్ జిల్లా ఆసుపత్రిలో మరో మహిళకు పురిటి నొప్పులొస్తే సాయంగా అక్కడే ఉండిపోయింది. ఈ క్రమంలో ఏం చేయాలో పాలుపోక ఆశా వర్కర్ సలహాతో జిల్లా వైద్య అధికారి డాక్టర్ మనీషాను రవీనా కుటుంబం సంప్రదించింది. ఆ అత్యవసర పరిస్థితి గురించి జిల్లా కలెక్టర్ సంస్కృతి జైన్కు జిల్లా వైద్య అధికారి డాక్టర్ మనీషా వివరించింది.
కలెక్టర్ చొరవతో ఆ గ్రామం వెళ్లేందుకు వైద్య అధికారి మనీషాతో పాటు చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్.ఠాకూర్కు ఏర్పాట్లు చేశారు. హుటాహుటిన ఆశా వర్కర్ను వెంటబెట్టుకుని ఒక వాహనంలో ఆ గ్రామానికి బయల్దేరారు. అయితే.. ఆ ఊళ్లోకి వెళ్లేందుకు ఒక వాగు దాటాల్సి ఉంది. ఆ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి సమయం. చిమ్మ చీకటిగా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ విషమ పరిస్థితిలో డాక్టర్ మనీషా సమయస్పూర్తితో ఆలోచన చేసింది.
ALSO READ | వర్షాకాలంలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
రవీనా స్వగ్రామానికి చెందిన ఒక ట్రైనీ నర్స్కు ప్రసవం ఎలా చేయాలో ఫోన్లో చెబుతూ.. పురుడు పోసే ప్రక్రియను వివరించింది. ఆ ట్రైనీ నర్స్ విజయవంతంగా రవీనాకు పురుడు పోసింది. రవీనా పండటి కవలలకు జన్మనిచ్చింది. వరద ఉధృతి తగ్గాక వైద్య బృందం రవీనాను, ఆ కవల పిల్లలను మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలను కాపాడేందుకు వైద్య అధికారి మనీషా, ఆశా వర్కర్, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్.ఠాకూర్ చూపిన చొరవను విషయం తెలిసిన వారంతా అభినందించారు.