- పురుగు మందు డబ్బాతో ఓ రైతు ఆందోళన
- ప్రజావాణిలో పలువురు బాధితుల ఫిర్యాదు
చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని సర్వే నెంబర్ 838లో గల 4.27 ఎకరాలు, 837/2లో ఎకరం భూమిని కొందరు కబ్జా చేశారని ఆరోపిస్తూ... పెద్దకొండ లక్ష్మీరాజం అనే రైతు తన కుటుంబంతో కలిసి పురుగుల మందు డబ్బా పట్టుకుని తన పొలం గట్టుపై ఆందోళన చేశాడు. పట్టణానికి చెందిన రేవల్లి పోచం, రేవల్లి మహేశ్ అనే వ్యక్తులు భూమిని కబ్జా చేశారని, అధికారులు ఎంక్వైరీ చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. లేదంటే తమకు చావే దిక్కని ఆవేదన వ్యక్తం చేశాడు.
భూకబ్జాపై ప్రజావాణిలో ఫిర్యాదు..
చెన్నూరు మండలం ఎల్లక్కపేట శివారులోని సర్వే నెంబర్ 108 లో తమకు వారసత్వంగా వచ్చిన కోట్ల రూపాయలు విలువైన 1.37 ఎకరాల వ్యవసాయ భూమిని పట్టణానికి చెందిన కొందరు బడా నేతలు కబ్జా చేశారని పలువురు లంబాడీలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమ భూమిని ఆక్రమించడమే కాకుండా ప్లాట్లుగా మార్చి అమ్మకానికి పెట్టారని, ఆఫీసర్లు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.