స్టేషన్‌ఘన్‌పూర్(చిల్పూరు), వెలుగు : జనగామ జిల్లా చిల్పూరు మండలం కిష్టాజిగూడెంలో సోమవారం ఓ రైతు అప్పుల బాధతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం..కిష్టాజిగూడం గ్రామానికి చెందిన రైతు ముడిక వెంకటయ్య(55)కు మూడెకరాల భూమి ఉంది. దీనికి తోడు మరో ఐదు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. రెండు సంవత్సరాలుగా వరి, పత్తి పంటల సాగులో పెట్టుబడుల కోసం పరిచయస్తుల దగ్గర అప్పులు చేశాడు. అయితే, ఆశించిన మేరకు పంట దిగుబడి రాలేదు. కొన్నేండ్ల కింద సొంతిల్లు కట్టుకున్నాడు.
ఇద్దరు కొడుకులుండగా పెద్ద కొడుకు, కూతురు పెండ్లి చేశాడు. మొత్తంగా వ్యవసాయంలో పంటల సాగుకు, ఇంటి అవసరాల కోసం రూ. 20 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది.అప్పులు తీర్చే దారి కనిపించకపోవడంతో సోమవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి చిన్నకొడుకు రంజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు.