
పర్వతగిరి (సంగెం), వెలుగు : చేనుకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు కరెంట్ షాక్‌తో చనిపోయాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం వీఆర్‌ఎన్ తండాలో శుక్రవారం జరిగింది. ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన గుగులోతు సురేశ్ (27) తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ప్రస్తుతం మక్కజొన్న సాగు చేయగా... చేనుకు నీళ్లు పెట్టేందుకు శుక్రవారం పొలం వద్దకు వెళ్లాడు. మోటర్ నడవకపోవడంతో స్టార్టర్ వద్ద ఉన్న ఫ్యూజులను సరిచేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కరెంట్ షాక్ కొట్టడంతో అతడు కిందపడ్డాడు. చుట్టుపక్కల రైతులు గమనించి హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.