భుజాన నాగలి..చేతిలో ఉరితాడుతో డీజీపీ ఆఫీసుకు రైతు

న్యాయం కోసం ఓ రైతు నిరసన చేపట్టాడు. ఇందిరా పార్క్ నుంచి డీజీపీ ఆఫీసు వరకు భుజాన నాగలి ఎత్తుకొని ఓ చేత ఉరి తాడు పట్టుకుని అర్ధనగ్నంగా నడుచుకుంటూ వచ్చాడు. తనను మోసం చేసినవారిని శిక్షించాలని, ఒకవేళ తనదే తప్పని తేలితే నగరం నడిబొడ్డున ఉరి తీయాలని ఆవేదన వ్యక్తం చేశారు. 

వరంగల్ జిల్లా పోనకల్ గ్రామానికి చెందిన సురేందర్ తన భూమిని స్థానిక బీఆర్ఎస్ నేతలు తప్పుడు పత్రాలు సృష్టించి అతని తమ్ముడి పేరిట రాయించారని ఆరోపించారు. ఈ విషయంలో తాను స్థానిక పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ వారు సృష్టించిన పత్రాలు సరైనవే అయితే తనను హైదరాబాద్ నడిబొడ్డున ఉరి తీయాలని లేనిపక్షంలో తనకు న్యాయం చేయాలని అభ్యర్థించాడు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు సురేందర్ డీజీపీని కలిసేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. గవర్నర్ ,హైకోర్టు న్యాయమూర్తి , రాష్ట్ర డీజీపీ జోక్యం చేసుకోవాలని తన సమస్య పరిష్కరించాలని కోరాడు. తనకు న్యాయం జరిగేవరకు నిరసన కొనసాగిస్తానని స్పష్టం చేశాడు.