రైతు రుణమాఫీపై మంత్రి జగదీశ్‌‌రెడ్డిని నిలదీసిన రైతు

మంత్రి జగదీశ్‌‌రెడ్డిని ప్రశ్నించిన రైతు

పొంతన లేని ఆన్సర్ ఇచ్చి వెళ్లిపోయిన మంత్రి

యాదాద్రి, వెలుగు : రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన మంత్రి జగదీశ్‌‌ రెడ్డిని రుణమాఫీపై ఓ రైతు ప్రశ్నించాడు. సీఎం కేసీఆర్‌‌‌‌ ఇచ్చిన రైతు రుణమాఫీ అమలు కావడం లేదంటూ మంత్రిని ప్రశ్నించగా, పొంతన లేని సమాధానం చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన సోమవారం యాదాద్రి జిల్లా భువనగిరిలో జరిగింది. జిల్లాలోని వలిగొండ, బీబీనగర్‌‌‌‌లో మంత్రి జగదీశ్‌‌రెడ్డి పీహెచ్‌‌సీ బిల్డింగ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, భువనగిరిలో నూతనంగా నిర్మించిన పట్టణ నిరాశ్రయుల వసతి గృహం, గ్రంథాలయ బిల్డింగ్‌‌లను ప్రారంభించడంతో పాటు రైతు సేవా కేంద్రం, వెయ్యి టన్నుల సామర్థ్యంతో నిర్మించే గోడౌన్‌‌కు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన సభలో జగదీశ్‌‌ రెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో వివరించారు. తర్వాత మంత్రి స్టేజ్‌‌ దిగి వెళుతుండగా, హరినాథరెడ్డి అనే రైతు.. “రుణమాఫీపై సీం కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు కాలేదు”అని ప్రశ్నించాడు. “సీఎం హామీ ఇచ్చిన మాట నిజమే. ఇంతకు ముందు రూ.లక్ష చేశాం. ఇప్పుడు రూ.50 వేలు మాఫీ చేస్తం”అంటూ పొంతన లేని సమాధానమిచ్చి మంత్రి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న మరికొందరు రైతులు.. ఎలక్షన్స్‌‌ వస్తున్నాయ్‌‌ కదా.. ఇప్పుడు కచ్చితంగా రుణమాఫీ చేస్తారంటూ కామెంట్స్ చేశారు.