- రైతు డెడ్ బాడీతో గ్రామస్తుల ధర్నా
- మున్సిపల్ ఆఫీసుకు తెస్తుండగా అడ్డుకున్న పోలీసులు
- శవాన్ని రోడ్డుపైనే ఉంచి బైఠాయింపు
- ఐదు గంటల పాటు టెన్షన్ టెన్షన్
కామారెడ్డి, వెలుగు: మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ వల్ల తన భూమి రేటు పడిపోయిందని ఆందోళన చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రైతు డెడ్ బాడీని ట్రాక్టర్ లో మున్సిపల్ ఆఫీసుకు తీసుకెళ్లి ధర్నా చేసేందుకు గ్రామస్తులు, తోటి రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. శవాన్ని అక్కడే ఉంచి రైతులంతా మున్సిపల్ ఆఫీసుకు వెళ్లి ధర్నా చేపట్టారు. దీంతో కామారెడ్డిలో ఐదు గంటల పాటు టెన్షన్ వాతావరణం నెలకొంది.
సదాశివనగర్ మండలం అడ్లూర్ఎల్లారెడ్డికి చెందిన రైతు పయ్యావుల రాములు( 42) తల్లి నర్సవ్వ పేరిట ఇల్చిపూర్ శివారులో 2.5 ఎకరాల భూమి ఉంది. ఈమెకు ఇద్దరు కొడుకులు ఉండగా, రాములు పెద్దవాడు. ఇటీవల కొత్తగా ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్‌లో నర్సవ్వ పేరిట ఉన్న భూమి ఇండస్ట్రియల్ జోన్లోకి వెళ్లింది. జోన్ మారడంతో ఈ భూమి విలువ బాగా తగ్గిపోయింది. దీంతో తన వాటా భూమిని అమ్ముకుని అప్పులు కట్టాలని అనుకున్న రాములు కొంతకాలంగా దిగులుతో ఉన్నాడు. మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకున్నాడు.
సర్కార్ తీరు దారుణం: ఏనుగు రవీందర్ రెడ్డి
మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యేలు, గవర్నమెంట్ పట్టించుకోకపోవటం దారుణమని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి విమర్శించారు. రాములు కుటుంబసభ్యులను పరామర్శించి మాట్లాడారు. రాళ్లు, రప్పలు ఉన్న భూమిని వెంచర్లు చేస్తున్న లీడర్లు.. పంటలు పండే భూములను ఇండస్ట్రియల్ జోన్లుగా చూపెట్టి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని అన్నారు. కలిసి పోరాడదామని, ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు.
రాములుది ప్రభుత్వ హత్యే: షబ్బీర్ అలీ
రాములు ఆత్మహత్య.. ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ ఒక ప్రకటనలో విమర్శించారు. బాధిత ఫ్యామిలీకి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్‌లో ఇండస్ర్టియల్, గ్రీన్ జోన్లను రద్దు చేయాలన్నారు.
పట్టణంలో ఉద్రిక్తత
రాములు శవాన్ని ట్రాక్టర్ లో మున్సిపల్ ఆఫీసుకు తీసుకొస్తుండగా కొత్త బస్టాండ్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. తర్వాత శవాన్ని అక్కడే వదిలేసి మున్సిపల్ ఆఫీసుకు చేరుకున్నారు. కమిషనర్ దేవేందర్‌ను నిలదీశారు. ఇది డ్రాఫ్ట్మాత్రమేనని, ఎవరికి అభ్యంతరాలున్నా ఈ నెల11 వరకు చెప్పవచ్చని, వాటిని పరిశీలించిన తర్వాతే మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందుతుందని కమిషనర్ చెప్పారు. అధికారులు, పోలీసుల తీరును నిరసిస్తూ.. రాములు భార్య, ఇద్దరు కొడుకులు అభినవ్(16), నిషాంత్(12) అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. వారికి బీజేపీ నేతలు, కౌన్సిలర్లు, పలు గ్రామాల రైతులు మద్దతు తెలిపారు. చివరకు బుధవారం రాత్రి పోస్టుమార్టం పూర్తి చేయించిన పోలీసులు శవాన్ని అడ్లూర్ఎల్లారెడ్డికి పంపారు.