ఓ రైతు కథ: 16 ఎకరాల్లో 12 పంటలు పండిస్తున్నారు..!

ఓ రైతు కథ: 16 ఎకరాల్లో 12 పంటలు పండిస్తున్నారు..!

చిట్యాల, వెలుగు: చాలామంది రైతులు ఒకటి లేదా రెండు రకాల పంటలు మాత్రమే సాగు చేస్తుంటారు. పంటను నమ్ముకుని అప్పులు చేసి మరీ పెట్టుబడి పెడతారు. ధాన్యం చేతికొచ్చే టైంలో ప్రకృతి సహకరించకనో, మార్కెట్లో ధర తగ్గడమో జరగుతుంటుంది. అలాంటప్పుడు అప్పులు తీర్చలేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అందుకే ఈ రైతు కాస్త కొత్తగా ఆలోచించాడు. అనేక రకాల పంటలు వేస్తూ లాభాలు పండిస్తున్నాడు. ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంటలో లాభం వస్తుందనే సూత్రాన్ని నమ్మి కరువు ప్రాంతంలో సిరులు పండిస్తున్నాడు.

జగ్గయ్యపేటకు చెందిన కామినేని దుర్గాకుమార్ చిట్యాల శివారులో జాతీయ రహదారి పక్కన మూడేళ్ల క్రితం పదహారు ఎకరాలు కొన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక రకాల వాణిజ్య పంటలు, కూరగాయలను.. చెరువు మట్టి, పెంట, కంపోస్ట్, ఎరువు వాడుతూ పండిస్తున్నాడు. సెమీ ఆర్గానిక్ విధానంలో ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తుండడంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తున్నాయి. అంతేకాదు పది నుంచి పన్నెండు రకాల పంటలు వేస్తుండడంతో ఒకదానిలో నష్టం వచ్చినా మరో పంటలో లాభం వస్తుంది. 

దీంతో అప్పులపాలయ్యే అవకాశాలు -తక్కువ. అంతేకాకుండా అంతర పంటలు వేస్తూ చీడపీడల నివారణకు మందులు వాడకుండానే చెక్ పెడుతున్నాడు. దుర్గాకుమార్ ఎక్కువగా వరి, పత్తి, పసుపు, కాకర, మిర్చి, బంతి, దోస, వంకాయ, సొరకాయ, బెండ, కంది పంటలు సాగు చేస్తున్నాడు. రెండెకరాల్లో బొప్పాయి ఇందులో ఇతర పంటలుగా బంతి, పసుపు పండిస్తున్నాడు. బొప్పాయి సాళ్ల మధ్యలో పసుపు పెట్టడం వల్ల వేరుకుళ్లు రాకుండా ఉంటుంది. అక్కడక్కడ బంతి మొక్కలు నాటితే బొప్పాయికి చీడపీడలు రావు. మరో రెండెకరాల్లో దోస సాగు చేస్తున్నాడు అందులో అంతరపంటగా కంది పండిస్తున్నాడు. మరో ఎకరంలో ట్రెక్కింగ్ విధానంలో కాకర సాగు చేస్తున్నాడు. అందులో అంతర పంటగా టొమాటో పండిస్తున్నాడు.

ఎక్కడైనా తీగజాతి కూరగాయలను పందిరిపై పండిస్తారు. కానీ పందిరి సాగు వల్ల తీగలకు సూర్యరశ్మి గాలి సరిగా అందక చీడపీడలు ఎక్కువై దిగుబడి తగ్గుతుంది. తీగలకు మందులు పీచికారి చేయడం కాయలు కోయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికి దుర్గాకుమార్ ఒక కొత్త పద్ధతిని ఎంచుకున్నాడు అదే ట్రెక్కింగ్' ఇందులో కాయలు కోయడం, మందులు స్ర్పే చేయడం చాలా ఈజీ. రెండు సాళ్ల మధ్యలో స్థలం  వేస్ట్ కాకుండా టొమాటోను పండించడం వల్ల అదనపు ఆదాయం వస్తుంది. ఇంకో ఎకరంలో పచ్చిమిర్చిని పండిస్తూ అంతరపంటగా బంతి టమాటా సాగు చేశాడు. దీంతో మిరపలో చీడపీడలను బంతిపూలు ఆకర్షి్స్తాయి. మిరపకు ఎలాంటి వైరస్ సోకదు. దాంతో అధిక దిగుబడి వస్తుంది. ఇంకో మూడెకరాల్లో పత్తి ఒక ఎకరంలో వరి సాగు చేస్తున్నాడు.


వాణిజ్య పంటలతో పాటు కూరగాయలు కూడా పండించడం వల్ల ప్రతి రోజూ ఎంతో కొంత డబ్బు చేతికొస్తుంది అంటున్నాడు దుర్గాకుమార్. ఆ డబ్బునే వాణిజ్య పంటల సాగుకు ఖర్చు చేస్తున్నాడు. గట్ల చుట్టూ కొబ్బరి, పూల మొక్కలు నాటాడు. నేను మొదట జగ్గయ్యపేటలో వ్యవసాయం చేశాను. 3 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నా. హైదరాబాద్ లోని పీడీఏఐ యూనివర్సిటీ వాళ్ల సూచనలతో ఈ కొత్త వ్యవసాయానికి శ్రీకారం చుట్టాను. ఇలా చేయడం వల్ల నష్టాలు రావడంలేదు. మార్కెట్ లో ఎప్పుడు దీనికి డిమాండ్ ఉంటుందో చెప్పడం కష్టం. అలా అని ఏదోఒకటి పండించి నష్టపోవడం ఇష్టం లేదు. అందుకే ఉన్న తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకుని పండిస్తున్నాను. దీంతో ప్రతి సంవత్సరం అన్ని ఖర్చులు పోను పది లక్షలకుపైగా ఆదాయం వస్తోంది' అని చెప్పారు దుర్గాకుమార్.


దుర్గాకుమార్‎ను మిగతా రైతులు ఆదర్శంగా తీసుకోవాలి. ఆయనకు మీ వంతుగా సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా క్రిస్, మల్డింగ్, జాలి 50 నుంచి 90 శాతం సబ్సిడికి అందించాం. మిగతా రైతులు కూడా అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కూరగాయలను పండించాలి. కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఒక్క ఎకరం వరి పండించడానికి అవసరమైన నీటితో క్రిప్ ద్వారా నాలుగు ఎకరాల్లో కూరగాయలు, వాణిజ్య పంటలు సాగు చేసుకోవచ్చు. వరి, పత్తి నాలుగు నెలల తర్వాత దిగుబడి వస్తుంది. ఆ సమయంలో ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే రైతు నిండా మునగాల్పిందే. అలా కాకుండా కూరగాయలు పండిస్తే తక్కువ సమయంలో దిగుబడి రావడం వల్ల నిత్యం ఆదాయం వస్తుంది. ఈ సాగులో ఒకవేళ లాభం లేకున్నా రైతుకు నష్టం మాత్రం ఉండదు.. అంతరపంటల వల్ల చీడ పీడలకు అరికట్టడమే కాకుండా అదనపు ఆదాయం వస్తుంది.. హార్టికల్చర్ ఆఫీసర్, చిట్యాల

... వెలుగు లైఫ్