జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొన్న బస్సు

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న లారీ, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ స్పాట్ లోనే చనిపోయాడు. బస్సులోని నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 వరకూ మంది ఉన్నారు. వీరిలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గాయాలపాలైన వారిని ధర్మారం, కరీంనగర్ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. 

ప్రమాదానికి గురైన వాళ్లు గజ్వేల్ మండలం బెజగం గ్రామానికి చెందిన వారు. బంధువులు చనిపోవడంతో వారి అస్తికలను గోదావరి నదిలో కలిపేందుకు గజ్వేల్ నుంచి ధర్మపురికి ప్రైవేటు బస్సులో 50 బయలుదేరారు. అంబారిపేట గ్రామ శివారు వద్దకు రాగానే రోడ్డు ప్రమాదం జరిగింది.

ఏప్రిల్ 20న రాత్రి గాలి దుమారానికి రోడ్డు మీద కూలిన చెట్టే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. రోడ్డుపై పడ్డ చెట్టును తప్పించబోయి లారీని బస్సు ఢీ కొట్టింది. లారీ కరీంనగర్ వైపు.. మినీ బస్సు ధర్మపురికి వెళ్తుండగా ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.