మిడ్జిల్, వెలుగు : సోలార్ ప్లాంట్‌లో చోరీ చేసేందుకు వచ్చిన తండ్రీకొడుకు కరెంట్‌షాక్‌తో చనిపోయారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. బోయిన్‌పల్లి గ్రామంలోని ప్రగతి సోలార్ ప్లాంట్‌లో కొన్ని రోజులుగా వైర్లు చోరీ అవుతున్నాయి. దీంతో ప్లాంట్ నిర్వాహకులు ప్రస్తుతం ఉన్న ఫెన్సింగ్‌కు లోపల మరో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి విద్యుత్ సప్లై ఇచ్చారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలకు చెందిన తండ్రీకొడుకు బాలస్వామి (42), జయరాజ్ (17) కలిసి మంగళవారం అర్ధరాత్రి చోరీ చేసేందుకు ప్లాంట్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో ముందున్న ఫెన్సింగ్‌ను కట్టర్‌తో తొలగించి లోపలికి వచ్చారు. తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన రెండో ఫెన్సింగ్‌ను సైతం కట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే దానికి విద్యుత్ సప్లై ఉండడంతో షాక్ కొట్టి ఇద్దరు స్పాట్‌లోనే చనిపోయారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘటన జరిగిన ప్రదేశంలో కట్టర్లు, గోనె సంచులు దొరికాయని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివనాగేశ్వర్‌రావు తెలిపారు.