అప్పుల బాధతో 18 నెలల కూతురితో చెరువులో దూకిన తండ్రి

అప్పుల బాధతో 18 నెలల కూతురితో చెరువులో దూకిన తండ్రి

నిజామాబాద్, వెలుగు: ఓవైపు బిడ్డ అనారోగ్యం, మరోవైపు అప్పుల బాధ కారణంగా 18 నెలల కూతురితో కలిసి తండ్రి సూసైడ్ చేసుకున్నాడు. నిజామాబాద్ నగరంలోని వర్ని చౌరస్తాలో నివాసముండే క్రాంతికుమార్ (35)​, మానసకు మూడేండ్ల కింద పెండ్లి జరిగింది. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద బిడ్డ స్నేహశ్రీకి 18 నెలలు, చిన్న బిడ్డకు 3 నెలలు. పెద్ద బిడ్డ స్నేహశ్రీ బ్రెయిన్​ట్యూమర్​తో పుట్టింది. డిచ్​పల్లిలోని ధర్మారం గురుకులంలో ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్​గా పనిచేసే క్రాంతికుమార్..​ బిడ్డ ట్రీట్ మెంట్ కోసం సుమారు రూ.3 లక్షలు అప్పు చేశాడు.  లోకల్ హాస్పిటల్స్ లో తిరిగినా ఫలితం దక్కలేదు. ఈ మధ్యనే  కొత్త ఇల్లు నిర్మించిన క్రాంతికుమార్..​ ఫ్రెండ్స్​వద్ద మరో రూ.3 లక్షల దాకా అప్పు చేశాడు. ఈ క్రమంలో అప్పులోళ్ల నుంచి ఒత్తిడి పెరిగింది. ఓవైపు బిడ్డ ఆరోగ్యం మెరుగుపడకపోవడం, మరోవైపు అప్పుల బాధ పెరగడంతో క్రాంతికుమార్ ఒత్తిడికి గురయ్యాడు. 

 బర్త్ డే వేడుకలు జరుపుకుని..  

క్రాంతికుమార్ ఆదివారం తన జన్మదినం కావడంతో ఇద్దరు కూతుళ్లకు ఒకే రంగు డ్రెస్సులు తెచ్చాడు. భార్య మానసతో కలిసి ఇంట్లో వేడుక నిర్వహించి తల్లిదండ్రులు, అత్తామామకు వీడియో కాల్​చేసి చూపాడు. ఫొటోలు, వీడియోలు తీసి అర్ధరాత్రి ఒంటిగంట దాకా సందడి చేశాడు. అయితే చిన్న బిడ్డకు అతను ఉగ్గు తినిపిస్తున్న టైంలో భార్య నిద్రలోకి జారుకుంది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు గజగజ వణికించే చలిలో తన ఫ్యాషన్​ప్రో బైక్​పై పెద్ద బిడ్డ స్నేహశ్రీని పడుకోబెట్టుకొని 6 కిలోమీటర్ల దూరంలోని న్యాల్​కల్​మాసాని చెరువు వద్దకు క్రాంతికుమార్ వెళ్లాడు. ఆ తర్వాత బిడ్డను ఎత్తుకుని అందులోకి దూకేశాడు. పొద్దున నిద్రలేచిన భార్య.. క్రాంతికుమార్​రాసిన లెటర్ చూసి  షాక్​కు గురైంది. 

జీవితంలో ఏమీ సాధించలేక పాపతో కలిసి సూసైడ్​చేసుకుంటున్నానని, మరో పెళ్లి చేసుకోవాలని లెటర్​లో రాశాడు. లెటర్ చదివిన బంధువులు, పోలీసులు న్యాల్​కాల్​ చెరువు వద్దకు వెళ్లగా మైసమ్మ గుడి వద్ద క్రాంతికుమార్ బైక్,​ కొద్ది దూరంలో అతని చెప్పులు కనిపించాయి. పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి చెరువులో గాలించగా తండ్రి, కూతురి డెడ్​బాడీలు బయటపడ్డాయి. భర్త, పెద్ద బిడ్డ మృతదేహాలను చూసి మానస గుండెలవిసేలా రోదించింది. అప్పు ఇచ్చిన ఓ వ్యక్తి తిరిగి కట్టుమని ఆదివారం పదిసార్లు ఫోన్​ చేసి బెదిరించాడని ఆమె మీడియాకు తెలిపింది. ముప్కల్​పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.