రాయికోడ్, వెలుగు : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సంగాపూర్‌లో ఈ నెల 16న బయటపడ్డ బాలిక మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బాలికను తండ్రే చంపినట్లు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హన్మంతు, రాయికోడ్ ఎస్సై నారాయణ మంగళవారం వెల్లడించారు.
సంగాపూర్ గ్రామానికి చెందిన మధుగడ్డ సతీశ్ 12 ఏండ్ల కింద అదే గ్రామానికి చెందిన అనితను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి వైష్ణవి (11), హరిత (6) ఇద్దరు కూతుళ్లు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో గతేడాది నవంబర్ 8న అనిత ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి సతీశ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి సమ్మమ్మ వద్ద ఉంటున్నాడు.
చిన్న కూతురు హరిత ఇటీవల అనారోగ్యంతో చనిపోయింది. తర్వాత పెద్ద కూతురు వైష్ణవి తల్లి వద్దకు వెళ్తానంటూ తండ్రి సతీశ్‌తో గొడవ పడేది. దీంతో కూతురిని చంపేయాలని నిర్ణయించుకున్న సతీశ్ ఈ నెల 9న తెల్లవారుజామున వైష్ణవిని నిద్ర లేపి తల్లి వద్దకు తీసుకెళ్తానంటూ బయటకు తీసుకొచ్చాడు. గ్రామ సమీపంలోని ఓ బావి వద్దకు తీసుకురాగా అనుమానం వచ్చి బాలిక అరవడంతో నోరు మూసి, గొంతు నులిమి బావిలో పడేశాడు.
అనంతరం ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చాడు. వైష్ణవి ఏదని అతడి తల్లి అడగడంతో తనకు తెలియదని సమాధానమిచ్చాడు. ఈ నెల 16న గ్రామ సమీపంలోని ఓ బావి వద్ద వైష్ణవి దుస్తులు, చెప్పులు, ఆధార్‌కార్డు, తల్లిదండ్రుల ఫొటో కనిపించడంతో స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో సతీశ్ ఏమీ తెలియనట్లు తన తల్లి సమ్మమ్మతో కలిసి బావి వద్దకు వెళ్లాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అయితే బాలిక మృతిపై తన కొడుకు సతీశ్‌పైనే అనుమానం ఉందని అతడి తల్లి చెప్పడంతో పోలీసులు సతీశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి నారాయణఖేడ్ కోర్టులో హాజరిపరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ట్రైనింగ్ ఎస్సైలు నిఖిల్, వెస్లీ, సిబ్బంది సంగారెడ్డి, సుభాశ్ పాల్గొన్నారు.