- బంగ్లాదేశ్ మహిళ చేతిలో మోసపోయి..కొడుక్కి దూరమైన తండ్రి
- ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్న వికారాబాద్ జిల్లా వాసి
- న్యాయం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన బాధితుడు
కరీంనగర్, వెలుగు : బంగ్లాదేశ్ మహిళ చేతిలో మోసపోయి..కన్న కొడుక్కి దూరమైన ఓ తండ్రి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. బంగ్లాదేశ్‌లో ఉన్న తన కొడుకును ఇండియాకు రప్పించేందుకు ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నాడు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం లింగన్నపల్లికి చెందిన మాగాని తిరుపతయ్య అనే గృహనిర్మాణ కార్మికుడికి 2016లో ముంబైలో పనిచేసే చోట తోటి కార్మికురాలు రియాతో పరిచయమైంది. ఇది ప్రేమగా మారి ఇద్దరూ 2017లో దండలు మార్చుకుని పెండ్లి చేసుకున్నారు. కొంతకాలానికి ఆమె ఇండియన్ కాదని బంగ్లాదేశ్ వాసి అని తెలిసింది.
నిలదీస్తే తిరుపతయ్యతోనే ఉంటానని తేల్చి చెప్పింది. తర్వాత వీరికి విశాల్ పుట్టాడు. కరోనా టైమ్‌లో భార్యను ముంబైలోనే ఉంచి తిరుపతయ్య సొంతూరుకు రాగా, తాను మరో పెండ్లి చేసుకున్నానని రియా ఫోన్ చేసి చెప్పింది. కొడుకు విశాల్‌ను మాత్రం తిరుపతయ్యకు అప్పగించింది. దీంతో విశాల్‌ను సొంతూరుకు తీసుకువచ్చి స్కూల్లో చేర్చించాడు. 2022లో మళ్లీ ముంబైకి వచ్చిన రియా...కొడుకును చూపించాలని తిరుపతయ్యను ప్రాధేయపడడంతో బాబును ముంబైకి తీసుకెళ్లాడు.
అక్కడే భార్య తరఫు బంధువులు తిరుపతయ్యను కొట్టి బాబును తీసుకువెళ్లిపోయారు. తిరుపతయ్య పోలీసులను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఈ లోపు బాబును రియా, ఆమె కుటుంబీకులు బంగ్లాదేశ్ తీసుకుపోయినట్టు తెలిసింది. అప్పటినుంచి తన దగ్గరున్న ఆధారాలు చూపిస్తూ కనిపించిన వారినల్లా తన కొడుకును తన దగ్గరకు చేర్చాలని వేడుకుంటున్నాడు.
బాలుడికి చిత్రహింసలు..
రియాను పెండ్లి చేసుకున్న వ్యక్తి బంగ్లాదేశ్‌లోని జెస్సోర్ జిల్లాలో తన కొడుకును హింసిస్తున్నాడని, విశాల్‌ను అప్పగించాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని తిరుపతయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తన కొడుక్కి ఏమీ కాకుండా ఉండేందుకు అప్పుడప్పుడు వారికి డబ్బులు పంపిస్తున్నానని చెప్పాడు. రియాను పెండ్లి చేసుకున్న వ్యక్తి ఆడియో, వీడియో కాల్స్ తన దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు.
ఓసారి బంగ్లాదేశ్ సరిహద్దు వరకూ వెళ్లి ఆగిపోయానన్నాడు. చివరగా ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను కలిసి గోడు వెల్లబోసుకున్నాడు.