యాదాద్రి, వెలుగు : యాదాద్రి కలెక్టరేట్ లో తోటి ఉద్యోగిపై మహిళా ఉద్యోగి కత్తితో దాడి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఆత్మకూర్ (ఎం) మండల ఏఓగా శిల్ప పనిచేస్తున్నారు. అదే మండలంలో మనోజ్ ఏఈఓగా పనిచేసేవాడు. ఊరికి దూరంగా ఉన్న రైతువేదిక కారణంగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. కొంతకాలంగా శిల్ప తన భర్త నుంచి దూరంగా ఉంటోంది. అయితే, గ్రామంలో మనోజ్, శిల్ప సన్నిహితంగా ఉంటున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో మనోజ్ ను అధికారులు యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇటీవలే మనోజ్ కొన్నినెలల పాటు ఉద్యోగానికి సెలవు పెట్టాడు.
దీంతో శిల్ప, మనోజ్ దూరంగా ఉంటున్నారు. ఏమైందో ఏమో వీరిద్దరి మధ్య పలుమార్లు ఫోన్లో వాగ్వాదం జరిగింది. కాగా, శిల్ప శుక్రవారం కలెక్టరేట్లోని అగ్రికల్చర్ ఆఫీసుకు వెళ్లారు. ఆ తర్వాత మనోజ్ కూడా అదే ఆఫీసుకు వెళ్లాడు. ఆఫీసులోనే అందరి ముందు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆఫీసు నుంచి బయటకు వచ్చిన వారిద్దరూ వెహికల్ పార్కింగ్ ప్లేస్‌లో మరోసారి గొడవకు దిగారు. ఈ సమయంలోనే శిల్ప కత్తితో మనోజ్ మెడపై దాడి చేసింది.
అక్కడే ఉన్న కొందరు ఆమెను ఆపారు. పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడిన మనోజ్‌ను హాస్పిటల్‌కు పంపించారు. దాడి ఘటనపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని డీసీపీ రాజేశ్ చంద్ర తెలిపారు. అయితే, తనపై మనోజ్ దాడి చేయడానికి ప్రయత్నించడంతో తాను కత్తి తీసుకొని దాడి చేశానని శిల్ప పేర్కొంది. మనోజ్ మాత్రం తాను కత్తి తేలేదని, శిల్పే కత్తి తీసుకొని తనపై దాడి చేసిందని చెప్పాడు.