చెట్లు కూలిన ఘటనపై ఫీల్డ్‌‌ ఎంక్వైరీ షూరు

చెట్లు కూలిన ఘటనపై ఫీల్డ్‌‌ ఎంక్వైరీ షూరు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి జిల్లా తాడ్వాయి, మేడారం అడవిలో గత నెల 31న భారీ సంఖ్యలో చెట్లు కూలడానికి గల కారణాలపై ములుగు ఫారెస్ట్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఫీల్డ్‌‌ లెవల్‌‌ ఎంక్వైరీ చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా పది టీమ్‌‌లను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 13 రేంజ్‌‌ ఆఫీస్‌‌లు ఉండగా 10 రేంజ్‌‌ ఆఫీస్‌‌ల పరిధిలోని 250 మంది ఉద్యోగులు ఈ విచారణలో నిమగ్నమయ్యారు. 

ఒక్కో టీమ్‌‌లో 25 మంది సభ్యులు ఉండగా టీమ్‌‌ లీడర్లుగా ఫారెస్ట్‌‌ రేంజ్‌‌ ఆఫీసర్లను నియమించారు. ఇంతటి విపత్తకు గల కారణాలపై వాతావరణ శాఖ, జాతీయ రిమోట్‌‌సెన్సింగ్‌‌ ఏజెన్సీ సహకారంతో విచారణ చేస్తున్నారు. ఆ రోజున ఏం జరిగిందన్న విషయంపై అటవీశాఖ టెక్నికల్ టీం మెట్రోలాజికల్‌‌, శాటిలైట్‌‌ డేటాతో ఆధారాలు సేకరిస్తున్నారు. తాడ్వాయి – మేడారం అడవిలో 204 హెక్టార్లలో 70 వేలకు పైగా భారీ వృక్షాలు నేలమట్టం అయినట్లు ప్రాథమిక అంచనాలో తేలింది. దీంతో ఒక్కో టీమ్‌‌‌‌ 20 హెక్టార్లలో ఎంక్వైరీ చేసి రిపోర్ట్‌‌ ఇవ్వాలని పీసీసీఎఫ్‌‌ డోబ్రియల్‌‌ ఆదేశించారు.

50 రకాల చెట్లు నేలమట్టం

అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో 10 టీమ్‌‌‌‌లకు చెందిన 250 మంది సభ్యులు శుక్రవారం ఫీల్డ్‌‌ ఎంక్వైరీలో పాల్గొన్నారు. వేర్లతో సహా పడిపోయిన చెట్లు ఎన్ని..? సగం వరకు విరిగినవి ఎన్ని..? గాలివానను తట్టుకొని నిలబడి ఉన్న చెట్లు ఎన్ని..? అనే వివరాలు, వాటి కొలతలు తీసుకుంటున్నారు. సుమారు 50 రకాల వృక్షాలు నేలమట్టం అయినట్లు ఆఫీసర్లు గుర్తించారు. టేకు, నల్లమద్ది, జిట్రేగి, బూరుగు, ఎర్రమద్ది, బొజ్జ, మారేడు, తెల్లమద్ది, నేరేడు వంటి చెట్లు కూడా కూకటివేళ్లతో సహా కూలిపోయాయని చెబుతున్నారు. ప్రతీ రోజు ఫీల్డ్‌‌‌‌లో ఎంక్వైరీ చేసిన రిపోర్ట్‌‌ను జిల్లా అటవీ శాఖ ఆఫీస్‌‌కు పంపుతున్నట్లు టీమ్‌‌ లీడర్లు చెప్పారు.