మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య గొడవ

మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య గొడవ
  • పలువురికి గాయాలు
  • పరస్పరం పోలీసులకు ఫిర్యాదు

గద్వాల, వెలుగు : రెండు వర్గాలు మద్యం మత్తులో గొడవకు దిగిన ఘటన శుక్రవారం గద్వాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గద్వాల పట్టణంలోని తెలుగు పేట,బీసీ కాలనీకి చెందిన వ్యక్తులు హోలీ అనంతరం స్నానం చేసేందుకు అగ్రహారంలోని కృష్ణానది వద్దకు వెళ్లారు. 

మద్యం మత్తులో ఉన్న ఇరువర్గాలు నది సమీపంలో గొడవకు దిగి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. అనంతరం ఓ వర్గానికి చెందిన వ్యక్తులు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా, విషయం తెలుసుకున్న మరో వర్గం వారు సైతం స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ మరోసారి వాగ్వాదం జరగడంతో విషయం తెలుసుకున్న రెండు వర్గాలకు చెందిన 100 నుంచి 200 మంది స్టేషన్‌కు వద్దకు వచ్చి కొట్టుకున్నారు. అలర్ట్‌ అయిన పోలీసులు లాఠీచార్జ్‌ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం ఇరువర్గాలకు చెందిన ముఖ్యమైన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ మొగులయ్య, సీఐ శ్రీను టౌన్‌ పీఎస్‌కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. 

వరంగల్‌ జిల్లాలో...

వర్ధన్నపేట, వెలుగు : మద్యం మత్తులో రెండు వర్గాలుగా విడిపోయిన యువకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మున్సిపాలిటీలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని భవానీకుంట తండాకు చెందిన గిరిజన యువకులు శుక్రవారం ఓ బార్‌షాప్‌లో మద్యం సేవించారు. 

ఈ క్రమంలో మాటమాటా పెరగడంతో యువకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపైమరొకరు దాడులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ మరోసారి గొడవకు దిగడంతో పోలీసులు చెదరగొట్టారు.