కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో ఓటర్లకు బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. విషయం తెలియగానే కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కొత్తపల్లికి వెళ్లారు. ప్రస్తుతం కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలు ఓటర్ల స్లిప్పుల్లో డబ్బులు పంచుతుండగా పట్టుకున్నామని బీజేపీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు.
ఈ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య గొడవ జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కొత్తపల్లి నుంచి వెళ్లాల్సిందిగా బండి సంజయ్ ను పోలీసులు కోరుతున్నారు. బలవంతంగా కొత్తపల్లి నుండి బండి సంజయ్ ను పంపేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. బండి సంజయ్ కు రక్షణ కవచంగా బీజేపీ కార్యకర్తలు నిలిచారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి గందరగోళంగా ఉంది.