పొత్తుల కత్తులు దిగేదెవరికి?

  • మిర్యాలగూడ, మునుగోడు స్థానాల కోసం లెఫ్ట్‌‌ పార్టీల పట్టు
  • పొత్తుల వల్ల కాంగ్రెస్​కు నష్టమంటున్న ఆశావహులు
  • కమ్యూనిస్టులకు టికెట్​ఇస్తే సహరించమని సంకేతాలు 
  • ‘సేవ్​కాంగ్రెస్​, సేవ్​ మిర్యాలగూడ’ పేరుతో లక్ష్మారెడ్డి నిరసన

నల్గొండ, వెలుగు : మిర్యాలగూడ, మునుగోడు స్థానాల కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య ఫైట్​నడుస్తోంది. పొత్తుల కత్తులు ఎవరికి దిగుతాయో అర్థంకాక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. రెండు సీట్లు తమకంటే తమకేనని కమ్యూనిస్టు లీడర్లు పట్టుబడుతుండగా.. వాళ్లకు టికెట్​ఇస్తే కాంగ్రెస్‌‌కు నష్టం జరుగుతుందని ఆపార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.  కాంగ్రెస్ కోసం  తమ రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి కష్టపడితే  పొత్తుల పేరు చెప్పి తమ సీట్లకు గండికొడతారా..? అని ఆశావహులు ప్రశ్నిస్తున్నారు.  

కాంగ్రెస్‌‌తో పొత్తులో భాగంగా సీపీఎం నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, ఖమ్మంలో పాలేరు, ఖమ్మం స్థానాలు కోరుతుండగా.. సీపీఐ కొత్తగూడెం, చెన్నూరు, హుస్నాబాద్​, మునుగోడు స్థానాలు అడుగుతోంది. దీంట్లో సీపీఐకి కొత్తగూడెం దాదాపు కన్ఫామ్ కాగా.. చెన్నూరు ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్​ ఉంది. కానీ అందుకు సీపీఐ రాష్ట్ర నాయకత్వం అంగీకరించట్లేదు.  చెన్నూరు  ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, దానికి బదులు మునుగోడు ఇవ్వాలని పట్టుబడుతోంది. ఈ మేరకు  మునుగోడులో సీపీఐ నేతలు ప్రెస్‌‌మీట్లు పెట్టి మరీ డిమాండ్ చేస్తున్నారు. 

మిర్యాలగూడలో రోడ్డెక్కిన కాంగ్రెస్​ నేతలు

‘సేవ్​ మిర్యాలగూడ, సేవ్ కాంగ్రెస్’ నినాదంతో ఆపార్టీ నేత బత్తుల లక్ష్మారెడ్డి రెండు రోజుల పాదయాత్ర చేపట్టారు. దామచర్ల నుంచి మిర్యాలగూడ వరకు కాం గ్రెస్​ కార్యకర్తలతో కలిసి నడిచారు. ఈ కార్యక్రమానికి నియోజక వర్గంలోని కాంగ్రెస్​ కేడర్​ పెద్ద ఎత్తున తరలివచ్చింది. సర్వేల ప్రకారం మిర్యాలగూడ కాంగ్రెస్​ గెలుస్తుందని, తనకే టికెట్ ఇవ్వాలని బీఎల్ఆర్​ పట్టుబడుతున్నారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం లక్ష్మారెడ్డి పేరును పార్టీ హైకమాండ్​కు సిఫార్సు చేశారు.  జానారెడ్డి వర్గం మాత్రం పొత్తులో భాగంగా సీపీఎంకు ఇచ్చినా ఒకేగానీ, బీఎల్‌‌ఆర్‌‌‌‌కు ఇవ్వొద్దని చెప్పినట్టు తెలిసింది.  

ఇందులో భాగంగానే కాంగ్రెస్​ ప్రకటించిన ఫస్ట్​ లిస్ట్‌‌లో మిర్యాలగూడ పేరు లేదని  ప్రచారం జరుగుతోంది. సీపీఎం లీడర్లు సైతం మిర్యాలగూడ తమదేనని చెప్పుకోవడం అందుకు ఊతమిస్తోంది.  ఇక్కడ 1999, 2014, 2018 ఎన్నికల్లో సీపీఎం ఒంటిరిగా పోటీ చేసి ఓడిపోయింది. 2004లో కాంగ్రెస్​, సీపీఎం పొత్తులో భాగంగా రంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 2009లో మహాకూటమితో కలిసి పోటీ చేసినా సీపీఎంకు ఫలితం దక్కలేదు. 

మునుగోడులో రేవంత్​ టీమ్ ​ఫైట్​ 

మునుగోడు టికెట్​తనకే ఖాయమైందని పీపీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అనుచరుడు చల్లమల్ల కృష్ణారెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఈమేరకు పార్టీ తన అభ్యర్థిత్వాన్నే ఫైనల్​చేసిందని ఆయన చెబుతుండగా.. సీపీఐ మాత్రం తమకే ఇవ్వాలని పట్టుబడుతోంది. చెన్నూరు సీటుతో తమకు ఎలాంటి ఉపయోగం లేదని, పార్టీకి బలం ఉన్న మునుగో డు కేటాయిస్తే మేలు జరుగుతుందని పార్టీ జిల్లా, రాష్ట్ర నేతలు పల్లా వెంక టరెడ్డి, నెల్లికంటి సత్యం అంటున్నారు. 2014లో కాంగ్రెస్​, సీపీఐ కలిసి దేవరకొండ, మునుగోడులో పోటీ చేశాయి.

దేవరకొండలో సీపీఐ గెలుపొందగా, మునుగోడులో కాంగ్రెస్​ రెబల్​అభ్యర్థి పాల్వాయి స్రవంతి పోటీ చేయడంతో సీపీఐ ఓడిపోయింది. 2018లో మళ్లీ కాంగ్రెస్​కు సీపీఐ మద్దతు ఇవ్వడంతో రాజగోపాల్​రెడ్డి గెలిచారని, కాబట్టి ఈసారి తమకే టికెట్​ఇవ్వాలని ఆపార్టీ డిమాండ్​ చేస్తోంది. అయితే ఉమ్మడి జిల్లాలో రేవంత్​టీమ్​కు ఒక్క సీటు అయినా దక్కుతుందని దాంట్లో మునుగోడు ఉంటుందని ఆవర్గం నేతలు ఆశిస్తున్నారు. మునుగోడు బైపోల్‌‌లో బీఆర్ఎస్​ కమ్యూనిస్టుల పొత్తుతోనే గెలిచిన సంగతిని గుర్తు చేస్తున్నారు. కానీ, చల్లమల కృష్ణారెడ్డి మాత్రం తనకే టికెట్​వస్తదని, కమ్యూనిస్టులు తమతోనే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.