ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు, అప్ డేట్ ల కోసం యూఐడీఏఐ కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక నుంచి గెజిటెడ్ అధికారుల అటెస్టెడ్ ఫ్రూఫ్ ల సహాయంతో ఆధార్ కార్డులోని అడ్రస్ (చిరునామా)లను మాత్రమే మార్చుకోవచ్చని తెలిపింది. ఇతర మార్పుల కోసం కచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్ లను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సబ్మిట్ చేసిన సర్టిఫికేట్లు, ఇతర పత్రాల్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇతర అవతవకలు ఉన్నట్టయితే వినియోగదారుడు (లేదా ఆధార్ కార్డుదారు) ఆధార్ సేవా కేంద్రానికి రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఆధార్ కార్డులు పొందేందుకు సమర్పించిన దరఖాస్తులు లేదా ఫ్రూఫ్స్ లలో ఏమైనా తేడాలుంటే ఆధార్ సేవా కేంద్రం ఇకనుంచి యూఐడీఏఐకి రూ.10వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డుల జారీకి దరఖాస్తుదారులు ఇచ్చిన అన్ వెరిఫైడ్ పత్రాలు సమర్పించినందుకు పలు ఆధార్ సేవా కేంద్రాల లైసెన్సులు కూడా యూఐడీఏఐ రద్దు చేసింది. లైసెన్సుల రద్దు మాత్రమే కాదు లక్షల్లో పెనాల్టీలు కూడా చెల్లించాల్సి రావడంతో కుటుంబ జీవనం కోసం అక్షయ కేంద్రాలు, ఇతర సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేసిన దివ్యాంగుల కుటుంబాలు కష్టాల్లో కూరుకుపోయాయి.
సీనియర్ సిటిజన్లు తమ పేర్లు, ఇంటి చిరునామా లాంటి ఇతర సవరణల కోసం ఆధార్ సేవాకేంద్రాల వద్ద అస్పష్టమైన, అన్ వెరిఫైడ్ పత్రాలను సమర్పించినట్లు తెలుస్తోంది. ఒక్కో ఆధార్ కార్డుపై ప్రతి సింగిల్ సర్వీసుకు సంబంధిత ఆధార్ సేవా కేంద్రానికి యూఐడీఏఐ రూ.36 ఫీజు పే చేస్తుండడం గమనార్హం.