- రంగారెడ్డి జిల్లా నందిగామలో ఘటన
షాద్ నగర్, వెలుగు : రంగారెడ్డి జిల్లాలోని ఓ డైపర్లు తయారీ కంపెనీ అగ్నికి ఆహుతైంది. నందిగామ మండల కేంద్రంలో కొన్నేండ్లుగా ‘కంసన్ హైజీన్కేర్ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో డైపర్లు తయారీ కంపెనీ నడుస్తోంది. ఇటీవల కొత్తగా నిర్మించిన షెడ్డులో మంగళవారం అర్ధరాత్రి తర్వాత మంటలు చెలరేగాయి. క్రమంగా కంపెనీ మొత్తాన్ని చుట్టుముట్టాయి. ఆ టైంలో అక్కడ పనిచేస్తున్న 50 మంది సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. అందరూ చూస్తుండగా క్షణాల్లో కంపెనీ మొత్తం తగలబడింది. రెండు రేకుల షెడ్డులు కుప్పకూలాయి.
ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఐదు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కాగా అప్పటికే రెండు రేకుల షెడ్లలోని సామాగ్రి, ప్రొడక్ట్స్ మొత్తం కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ.30 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు.