హనుమకొండ జీఎంహెచ్​లో అగ్నిప్రమాదం

  • తప్పిన పెను ప్రమాదం
  • షార్ట్​ సర్క్యూటే కారణం

హనుమకొండ, వెలుగు : హనుమకొండలోని గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్​(జీఎంహెచ్​)లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్​సర్క్యూట్​ కారణంగా ప్రమాదం జరగ్గా స్టోర్​రూమ్​లోని బ్లీచింగ్​ పౌడర్​, చీపుర్లు, యాసిడ్​బాటిల్స్, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. గమనించిన సిబ్బంది ఫైర్ ​డిపార్ట్​మెంట్​కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పేశారు.

స్టోర్ రూమ్​ హాస్పిటల్ ​వెనుక వైపు ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ, ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో దవాఖానకు వచ్చిన గర్భిణులు, బాలింతలు భయపడ్డారు. ప్రమాదంతో దవాఖానలో కొద్దిసేపు కరెంట్​సరఫరా ఆగిపోవడంతో వివిధ పరీక్షల కోసం దూరప్రాంతాల నుంచి వచ్చిన గర్భిణులు అవస్థలు పడాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న హనుమకొండ ఆర్డీవో ఎల్​.రమేశ్​ దవాఖానకు వచ్చి స్టోర్ రూమ్​ను పరిశీలించి నష్టంపై ఆరా తీశారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదికను కలెక్టర్ సిక్తా పట్నాయక్​ కు అందజేయనున్నట్లు ఆర్డీవో తెలిపారు.