మార్కెట్​ యార్డ్​ గోదాంలో మంటలు

  •     84వేల ధాన్యం బస్తాలు,  12.80 లక్షల గన్నీ బ్యాగులు దగ్ధం
  •     రూ.20  కోట్ల మేర ఆస్తి నష్టం
  •     ఘటనపై అనుమానాలు

పెబ్బేరు, వెలుగు :  వనపర్తి జిల్లా పెబ్బేరులోని మార్కెట్​యార్డు గోదాంలో సోమవారం సాయంత్రం మంటలు చెలరేగి 84 వేల ధాన్యం బస్తాలు, 12.80 లక్షల గన్నీ బ్యాగులు కాలిపోయాయి. ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంటలంటుకోవడాన్ని చూసిన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు చెప్పడంతో వారు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో గద్వాల, జడ్చర్ల, ఆత్మకూర్​ ఫైర్​ స్టేషన్లకు సమాచారమిచ్చారు. వారు కూడా వచ్చి అర్ధరాత్రి వరకు శ్రమించి మంటలు ఆర్పారు.

ఈ ప్రమాదంలో గోదాంలో ముగ్గురు వ్యాపారులు నిల్వ చేసిన 84 వేల ధాన్యం బస్తాలతో పాటు 12.80 లక్షల గన్నీ బ్యాగులు అగ్నికి ఆహుతయ్యాయి. వీటి విలువ సుమారు రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సమాచారం అందుకున్న కలెక్టర్​ తేజస్​ నందలాల్​ పవార్​, అడిషనల్ ​కలెక్టర్​ నాగేశ్, ఆర్డీవో పద్మావతి, పెబ్బేరు తహసీల్దార్​లక్ష్మి, ఎస్ఐ హరిప్రసాద్​రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం ఎలా జరిగందన్న దానిపై విచారణ చేస్తామని అడిషనల్​ కలెక్టర్​ తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎవరో కావాలనే నిప్పు పెట్టారనే  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్​ యాదవ్ మాట్లాడుతూ ప్రమాదం గురించి సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తామన్నారు.