హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్ గోదాంలో సోమవారం (డిసెంబర్ 30) అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ గోదాం నుండి భారీగా మంటలు ఎగిసిపడటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సహయంతో మంటలను ఆదుపులోకి తీసుకొచ్చారు.
గోదాంలో ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉండటం వల్ల మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అగ్ని ప్రమాదం వల్ల బిస్మిల్లా కాలనీలో దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనపై బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేప్టటారు. అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదంలో ఎంత మేర నష్టం వాటిల్లిందనే విషయం తెలియాల్సి ఉంది.