దౌస: రాజస్థాన్‌లో విషాద ఘటన వెలుగుచూసింది. దౌస జిల్లాలో బోరు బావిలో పడిన ఐదేళ్ల పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు. 150 అడుగుల బోర్వెల్ నుంచి ఆ బాలుడిని ప్రాణాలతో కాపాడేందుకు 56 గంటల పాటు రెస్క్యూ టీం పడిన శ్రమ వృధా అయింది. బోరు బావిలో పడిన ఆర్యన్‌ను(5) బయటకు తీయగానే ఉలుకుపలుకు లేకుండా పడి ఉన్నాడు. దీంతో.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఆర్యన్ ను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. రెండు రోజుల క్రితం ఆడుకుంటూ సాయంత్రం 3 గంటల సమయంలో ఆర్యన్ బోరుబావిలో పడిపోయాడు. ఒక పైప్ ద్వారా ఆక్సిజన్‌ను అందించే ప్రయత్నం చేశారు. 150 అడుగుల బోరుబావిలోకి ఒక కెమెరాను పంపి బాలుడి పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేశారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
Also Read:-నేను ఓ ‘స్టుపిడ్’ని.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కామెంట్..
డ్రిల్లింగ్ మెషీన్ల సాయంతో బోరుబావికి సమాంతరంగా తవ్వి బాలుడికి కాపాడారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు పలు అవాంతరాలు ఎదురయ్యాయి. తవ్వుతున్న సమయంలో బాలుడిపై మట్టి పడి ఇబ్బందులు ఎదురయ్యాయి. బాలుడికి ఒక తాడు కట్టి బయటకు బోరు బావి నుంచి బయటకు లాగారు. అప్పటికే బాలుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆర్యన్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో పిల్లాడి కుటుంబం విషాదంతో కుప్పకూలిపోయింది.